న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది స్పెషల్ కోర్టు. ఈడీ కేసులో జులై 3వ తేదీదాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దీంతో బెయిల్ వచ్చేదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఈ సందర్భంగా కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఆ వెంటనే ఈడీ కేసులో కస్టడీని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు జడ్జి కావేరీ బవేజా వెల్లడించారు.
ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, ఇద్దరు కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు.
కవితపై ఈడీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలు
- లిక్కర్ కేసులో కవిత పై ఈడీ అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు
- ఈడి మనీలాండరింగ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన స్పెషల్ కోర్టు
- రూ. 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీ
- రూ. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందింది
- 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు
- కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్న ఈడీ
సీబీఐ కేసులోనూ కస్టడీ పొడిగింపు
మరొకవైపు సీబీఐ కేసులో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కవిత పై చార్జ్ షీట్‌ను జూన్ 7న సీబీఐ దాఖలు చేయనుంది. సీబీఐ కేసులో భాగంగా నేటి మధ్యాహ్నం కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment