మళ్లీ తీహార్‌ జైలుకే కవిత | Delhi Liquor Scam: MLC Kavitha Arrest Case Updates | Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam: జ్యూడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు.. మళ్లీ తీహార్‌ జైలుకే కవిత

Published Tue, Apr 9 2024 8:00 AM | Last Updated on Tue, Apr 9 2024 12:34 PM

Delhi Liquor Scam: MLC Kavitha Arrest Case Updates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్‌ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్‌ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు ఈనెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మళ్లీ కవితను తీహార్‌ జైలుకు ఈడీ అధికారులు తరలించనున్నారు.

14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టు ముందుకు కవితను ఈడీ అధికారులు హాజరుపర్చిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా పేర్కొన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి కానీ అలాంటిది ఏమి లేదన్నారు రానా..

కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా, కవితను కోర్టులో నేరుగా మాట్లాడేందుకు జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది తెలుపగా, అప్లికేషన్ వేసుకోవాలంటూ జడ్జి కావేరి బవేజా సూచించారు. కవితను కోర్టులో  భర్త, మామ కలిసేందుకు కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు.

అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్‌ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి.. తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు.

కాగా, కవితను విచారించాలని కోర్టులో ఇప్పటికే  సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరగనుంది. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, మార్చి 16న ఆమెను కోర్టు ముందు హాజరు పర్చారు. మార్చి  23 వరకు కవితకు ఈడీ కస్టడీ, అనంతరం మరో మూడు రోజులు కవితకు ఈడి కస్టడీని కోర్టు పొడిగించింది. 26వ తేదీన కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది.

కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్‌ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్‌ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్‌ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్‌ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. 

చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా
‘‘పిటిషనర్‌ (కవిత) 16 ఏళ్ల మైనర్‌ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్‌ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్‌ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు.

కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్‌లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్‌ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్‌ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్‌ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది.  
కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది.

‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్‌ఏ చట్టం సెక్షన్‌ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్‌ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement