
వైద్యచికిత్సకు బెయిల్ ఇవ్వండి: మోపిదేవి
తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు వైద్య చికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సురేందర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు.
తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుకు వైద్య చికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సురేందర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. మోపిదేవి పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం విచారించారు.
మోపిదేవి తీవ్రమైన అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు కనీసం మూడు నెలలైనా బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది సురేందర్‌రావు నివేదించారు. అయితే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారిస్తేనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఈ కోర్టు గతంలో స్పష్టం చేసిందని, మొదట స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారని మోపిదేవి చెబుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని సీబీఐ స్పెషల్ పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీన్ని మోపిదేవి తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. మొదట ఇంజెక్షన్లు ఇస్తారని, వాటితో ఫలితం లేకపోతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్ధారించారని, ఈ రెండు విషయాలను తమ పిటిషన్‌లో పేర్కొన్నామని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈనెల 16కు వాయిదా వేశారు.