
‘క్విడ్ ప్రో కో’ లేదు
* 8 కంపెనీల్లో అలాంటి లావాదేవీలు జరగలేదు
* సీబీఐ కోర్టుకు నివేదించిన సీబీఐ ఎస్పీ
* ‘క్విడ్ ప్రో కో’ ఉన్నట్లు దర్యాప్తులో తేలలేదు
* మిగిలిన విషయాలు ఆయా శాఖలకు నివేదించాం
* జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో
* కోర్టు ఆదేశాల మేరకు మెమో దాఖలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎనిమిది కంపెనీల్లో ఎటువంటి ‘క్విడ్ ప్రో కో’ లావాదేవీలూ జరగలేదని సీబీఐ సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. వైఎస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి పురోగతిని వివరిస్తూ మెమో దాఖలు చేయాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు శనివారం సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయా వివరాలతో ఈ మేరకు సీబీఐ ఎస్పీ వి.చంద్రశేఖర్ సోమవారం ఒక మెమోను కోర్టులో దాఖలు చేశారు.
తమ దర్యాప్తులో సాండూర్ పవర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీ/బ్రహ్మణీ ఇన్‌ఫ్రా, ఆర్‌ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్ కంపెనీల్లో ‘క్విడ్ ప్రో కో’ లావాదేవీలు ఉన్నట్లు తేలలేదని స్పష్టం చేశారు. అయితే ఈ కంపెనీల్లో జరిగినట్లు చెబుతున్న నిబంధనల ఉల్లంఘన, అవకతవకల గురించి, ఆయా అంశాలు ఏయే శాఖల పరిధిలోకి వస్తాయో వాటికి నివేదించినట్లు కోర్టుకు విన్నవించారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు సంబంధించిన వ్యవహారం ఓఎంసీ కేసు పరిధిలోకి వస్తుందని, దానిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు.
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని అంశాల్లో దర్యాప్తు పూర్తి చేశామని ఈ మెమోలో పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలు, వ్యక్తుల పెట్టుబడులు, రాంకీ ఫార్మా, వాన్‌పిక్, దాల్మియా, ఇండియా, పెన్నా, రఘురామ్ సిమెంట్స్‌తో పాటు ఇందూ టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జి హబ్ అంశాలకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి 10 చార్జిషీట్లు దాఖలు చేసినట్లు కోర్టుకు నివేదించారు. హౌసింగ్ బోర్డు ద్వారా ఇందూ ప్రాజెక్టు పొందిన ప్రయోజనాలకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేశామని, త్వరలో తుది నివేదిక దాఖలు చేస్తామని తెలిపారు.
ఈడీ, ఐటీకి సిఫారసు
నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), ఆదాయపన్ను శాఖ (ఐటీ)లకు సిఫారసు చేసినట్లు సీబీఐ ఎస్పీ ఈ మెమోలో పేర్కొన్నారు. ఇలా సిఫారసు చేసిన కంపెనీల్లో కోల్‌కతాకు చెందిన ఆర్టిలెలజెన్స్ బయో ఇన్నోవేషన్స్, బేఇన్‌లాండ్ ఫైనాన్స్, భాస్కర్ ఫండ్ మేనేజ్‌మెంట్, క్లిఫ్‌టన్ పియర్సన్ ఎక్స్‌పోర్టు ఏజెన్సీస్, డెల్టన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, గంగా బిల్డర్స్, గ్రవ్‌మోర్ ఫండ్ మేనేజ్‌మెంట్, న్యూ ఔట్‌లుక్ సెక్యూరిటీస్, శక్తి ఇస్పాత్ ప్రొడక్ట్స్, శివలక్ష్మి ఎక్స్‌పోర్ట్స్, స్టాక్‌నెట్ ఇంటర్నేషనల్, సూపర్ ఫైనాన్స్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్, ఇస్పా షీట్స్, సుగమ్ కమోడీల్, చండ్లియర్ ట్రాకొన్ ఉన్నాయి.