జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి: వైఎస్ జగన్ | YS Jaganmohan reddy seeks cbi court permission for national tour | Sakshi
Sakshi News home page

జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి: వైఎస్ జగన్

Published Thu, Nov 7 2013 1:45 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి: వైఎస్ జగన్ - Sakshi

జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి: వైఎస్ జగన్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టాల్సి ఉందని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సహా ఇతర నేతలను కలిసేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు అనుమతించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన బెయిల్ షరతులను సడలించిన సీబీఐ ప్రత్యేక కోర్టు... రాష్ట్రవ్యాప్తంగా, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతిస్తూ గతనెల 30న ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.
 
 అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతోపాటు పార్టీ అధ్యక్షునిగా ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదని పేర్కొన్నారు. తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు... సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
 
 పాలెం వెళ్లలేకపోయా... షరతు సడలించండి
 కోర్టు విధించిన షరతు కారణంగా ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఓల్వో బస్సు దగ్ధమైన సంఘటన ప్రాంతానికి వెళ్లలేకపోయానని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించలేకపోయానని, ఆకస్మికంగా జరిగే సంఘటనలపై స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లేందుకు ఈ షరతు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో నగరం విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.
 
 9, 10న కడప పర్యటన...
 ఈనెల 9, 10న వైఎస్‌ఆర్ కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు నివేదించారు. 8వ తేదీన రాత్రి బయలుదేరి వెళ్లి... 11వ తేదీ ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటానని తెలిపారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి ఈనెల 8న బెంగుళూరు వెళ్తున్నట్లు సీబీఐ కోర్టుకు సమాచారం ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement