ఆరుషిని.. కన్నవారే కడతేర్చారు | Talwars: From devoted parents to Aarushi murder convicts | Sakshi
Sakshi News home page

ఆరుషిని.. కన్నవారే కడతేర్చారు

Published Tue, Nov 26 2013 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

ఆరుషిని.. కన్నవారే కడతేర్చారు

ఆరుషిని.. కన్నవారే కడతేర్చారు

ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు
రాజేశ్, నూపుర్‌లు సాక్ష్యాలను కూడా నాశనం చేసినట్లు నిర్ధారణ
నేడు వాదనల అనంతరం శిక్షల ఖరారు
హైకోర్టులో అప్పీల్ చేస్తామన్న నిందితులు

 
 ఘజియాబాద్: పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో శిక్షల ఖరారుపై మంగళవారం వాదనలు జరగనున్నాయి. నోయిడాలోని వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి సంబంధించి కూడా అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్ వారిని దోషులుగా పేర్కొన్నారు.

దర్యాప్తు సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగిన ఈ కేసులో ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం తీర్పు వెలువడింది. హత్యలపై నోయిడా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఐపీసీ సెక్షన్ 203 కింద ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఉదయం కోర్టు రెండుసార్లు వాయిదా పడిన తర్వాత.. ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న జడ్జి శ్యామ్‌లాల్ మధ్యాహ్నం 3.25 ప్రాంతంలో కోర్టు హాలులోకి ప్రవేశించారు. సంచలనం కలిగించిన ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో తీర్పు వెలువడనున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను కోర్టు హాలులోకి పిలిపించిన న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు.
 
 నిందితులిద్దరూ ఒకే లక్ష్యంతో హత్యలకు పాల్పడ్డారని జడ్జి తెలిపారు. ఐపీసీ సెక్షన్ 302 రెడ్ విత్ 34, 201 రెడ్ విత్ 34 కింద వారిని దోషులుగా నిర్ధారిస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం వాదనలు ముగిసిన తర్వాత జడ్జి శిక్షలు ఖరారు చేస్తారు. నోయిడాలో ప్రముఖులైన ఈ డాక్టర్ దంపతులు సోమవారం జడ్జి తీర్పు వెలువరించగానే కన్నీటితో కుప్పకూలిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. తీర్పు ప్రకటించిన వెంటనే తల్వార్ దంపతుల తరఫున ఓ ప్రకటన వెలువడింది. తామెంతో నిరాశకు గురయ్యామని, చేయని నేరానికి దోషులుగా నిర్ధారించబడినందుకు తమ హృదయం గాయపడిందని వారు పేర్కొన్నారు. ఓడిపోయినట్టుగా భావించేం దుకు నిరాకరిస్తున్నామని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. చట్ట ప్రకారం ఈ తీర్పు తప్పని, దీనిపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేస్తామని వారి తరఫు న్యాయవాది సత్యకేతు సింగ్ చెప్పారు. పనిమనుషులపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని ఈ తీర్పుతో స్పష్టమై పోయిందని వారిలో ఒకరి తరఫు న్యాయవాది చెప్పారు.
 
 తొలుత క్లీన్‌చిట్ ఇచ్చిన సీబీఐ
 ఇవి పరువు హత్యలనే వార్తల నేపథ్యంలో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. తొమ్మిదో తరగతి విద్యార్థి అయిన తమ కుమార్తె నేపాల్‌కు చెందిన 45 ఏళ్ల హేమరాజ్‌తో సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో ఆమె తల్లిదండ్రులే ఈ హత్యలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆరుషిని ఆమె తండ్రే హత్య చేశాడని అప్పటి ఇన్‌స్పెక్టర్ జనరల్ గురుదర్శన్ సింగ్ ఆరోపించడంతో నోయిడా పోలీసులు రాజేశ్ తల్వార్‌ను అరెస్టు చేశారు. కేసును సీబీఐకి అప్పగించిన కొంత కాలానికి ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. విచిత్రంగా సీబీఐ తొలుత తల్వార్ దంపతులకు క్లీన్‌చిట్ ఇచ్చింది.

 

ముగ్గురు పనిమనుషులు కృష్ణ, రాజ్‌కుమార్, విజయ్‌లపై నింద మోపింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే మూడు నెలల గడువులోగా చార్జిషీటు దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైంది. దాంతో వారు బెయిల్‌పై విడుదలయ్యారు. తర్వాత అప్పటి సీబీఐ డెరైక్టర్ కేసును తాజాగా దర్యాప్తు చేసేందుకు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల పాత్రపై అనుమానాలు ఉన్నప్పటికీ వాటిని నిరూపించే ప్రత్యక్ష ఆధారాలేవీ లేవని పేర్కొంటూ సీబీఐ కేసు ముగింపు నివేదికను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సీబీఐ జడ్జి తల్వార్ దంపతులపై హత్యాభియోగాలు మోపాల్సిందిగా ఆదేశించారు.
 
 ఈ నేపథ్యంలోనే నూపుర్ తల్వార్ కూడా అరెస్టు అయ్యారు. ఆ తర్వాత సుప్రీం ఆదేశాలతో ఆమె బెయిల్‌పై విడుదలయ్యా రు. 15 నెలల విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం 204 పేజీలతో తీర్పు వెలువడింది. ఈ కేసులో సీబీఐ వైఖరిపై అడిగిన ప్రశ్నకు ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది ఆర్.కె.సైని సమాధానమిస్తూ.. దర్యాప్తు అనేది నిరంతర ప్రక్రియ అని, చివరకు కోర్టులో దాఖలు చేసిన నివేదికనే తుది నిర్ణయంగా భావించాలని చెప్పారు. ఈ కేసులో గరిష్టంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే హత్యానేరానికి మరణశిక్ష విధించడం జరుగుతుంది. తీర్పుపై అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు రాజేశ్ తల్వార్ సోదరుడు దినేశ్ విలేకరులకు చెప్పారు. కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారనే ందుకు ఇది నిదర్శనమని మహిళా కాంగ్రెస్ నేత శోభా ఓఝా వ్యాఖ్యానించారు.
 
 ‘‘తమ పిల్లలకు ఉత్తమ సంరక్షకులు వారి తల్లిదండ్రులే. మానవ నైజ క్రమం ఇదే. కానీ మానవాళి చరిత్రలో తల్లీ, తండ్రే తమ పిల్లల హంతకులైనటువంటి అసహజ, విచిత్ర సంఘటనలు కూడా ఉన్నాయి. జీవితంలో కేవలం 14 వసంతాలు మాత్రమే చూసిన తమ కుమార్తెను వారు నాశనం చేశారు’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బైబిల్‌లోని 10 ఆజ్ఞల్లో ఒక దానిని (‘నరహత్య చేయరాదు’ (దొ షల్ నాట్ కిల్), ఖురాన్‌లోని ఓ నిషేధాజ్ఞ (‘దేవుడు పవిత్రంగా చేసినవాటి ప్రాణాలు తీయరాదు’ (టేక్ నాట్ లైఫ్ విచ్ గాడ్ హాజ్ మేడ్ సేక్రెడ్)ను గుర్తు చేశారు.
 
 ఎప్పుడేం జరిగింది...
     2008 మే 16: గొంతు కోయడంతో ఆరుషి తన పడకగదిలో ప్రాణాలు కోల్పోయి కన్పించింది.
     మే 17: తల్వార్ ఇంటి టైపై హేమరాజ్ మృతదేహం కన్పించింది.
     మే 23: జంట హత్యల ఆరోపణలతో రాజేశ్ తల్వార్ అరెస్టు
     మే 31: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది.
     జూలై 12: రాజేశ్ తల్వార్‌కు బెయిలు.
     2010 డిసెంబర్ 29: సీబీఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు
     2011 ఫిబ్రవరి 9: సీబీఐ క్లోజర్ రిపోర్టును తిరస్కరించిన ప్రత్యేక కోర్టు. రాజేశ్, నూపుర్ తల్వార్‌ల విచారణకు ఆదేశం. రాజేశ్, నూపుర్ తల్వార్‌లకు బెయిలబుల్ వారంట్ల జారీ
     2012 ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు
     సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై నూపుర్ విడుదల
     2013 ఏప్రిల్: తల్వార్ దంపతులు ఆరుషి, హేమరాజ్‌లను చంపినట్టుగా కోర్టుకు సీబీఐ నివేదన.
     నవంబర్ 12: కోర్టు తీర్పు రిజర్వ్
     నవంబర్ 25: రాజేశ్, నూపుర్ తల్వార్‌లు దోషులుగా నిర్ధారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement