- మాజీ ఐఏఎస్ కృపానందానికి కూడా..
- జూన్ 4న ప్రత్యక్షంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 4వ తేదీన ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందిగా వారిని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదేశించారు. రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించి బెయిల్ పొందాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ కేసులో కృపానందంను ఎనిమిదో, సబితా ఇంద్రారెడ్డిని తొమ్మిదో నిందితులుగా చేరుస్తూ ఈ నెల 9 న సీబీఐ అధికారులు దాఖలు చేసిన మరో అనుబంధ చార్జిషీట్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.
ఐపీసీ 120 (బీ) రెడ్‌విత్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) సెక్షన్ల కింద వారిపై అభియోగాలను విచారణకు స్వీకరించారు. సబితా ఇంద్రారెడ్డిని ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్‌లో సాక్షిగా పేర్కొన్నామని.. అయితే ఈ కేసులో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో నిందితురాలిగా చేర్చేందుకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోను కోర్టు అనుమతించింది. కాగా, 65పేజీల అనుబంధ చార్జిషీట్‌తో పాటు 104 అనుబంధ పత్రాలు, 36 మందిని సాక్షులుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో 2011 డిసెంబర్‌లో సీబీఐ దాఖలు చేసిన ప్రధాన చార్జిషీట్‌లో సబితను 53వ సాక్షిగా.. మొదటి, రెండో అనుబంధ చార్జిషీట్లలో 8వ సాక్షిగా పేర్కొన్నారు. ప్రధాన చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత సబిత, కృపానందంలను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ మరో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం.