కలెక్టర్కు తుపాకీ చూపించిన మాజీ మంత్రి
కలెక్టర్కు తుపాకీ చూపించిన మాజీ మంత్రి
Published Sat, Aug 27 2016 10:08 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
చెన్నై: రైతుల సమస్యా పరిష్కార సమావేశంలో తుపాకీ చూపి బెదిరించిన మాజీమంత్రిని చూసి ధర్మపురి కలెక్టర్ సహా సమావేశానికి హాజరైన అధికారులు దిగ్భ్రాంతి చెందారు. తమిళనాడులోని ధర్మపురి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం రైతుల సమస్యల పరిష్కార సమావేశానికి కలెక్టర్ వివేకానందన్ అధ్యక్షత వహించారు. 500లకు పైగా రైతులు, తమ సమస్యలైన ఆక్రమణ, చెరువుల సమస్యలు, ఉచిత విద్యుత్, ప్రభుత్వ రాయితీలకు సంబంధించి పలు వేరు సమస్యలను ముందుంచారు.
ఈ సమావేశంలో మాజీమంత్రి ముల్లైవేందన్ పాల్గొని రైతుల సమస్యలపై మాట్లాడారు. కంబైనల్లూర్‌లో 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అన్నాడీఎంకే ప్రముఖుడు ఆక్రమించారని, మెరాపూర్, కంబైనల్లూర్ ప్రాంతాల్లో రైతులకు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు పెట్టుకోగా ఇంతవరకు కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. హఠాత్తుగా సంచిలో నుంచి తుపాకీ తీసి కలెక్టర్‌కు గురిపెట్టారు. మాజీ మంత్రి చర్యతో కలెక్టర్ వివేకానంద దిగ్భ్రాంతి చెందారు. తాను రివాల్వర్‌ను రెన్యువల్ చేయాలని కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నానని అయితే ఇంతవరకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
దీనిపై తక్షణం చర్య తీసుకుంటామని తుపాకీని సంచిలోపల పెట్టమని కలెక్టర్ చెప్పడంతో మంత్రి తుపాకీ లోపల పెట్టారు. అధికారులు, రైతులు హాజరైన సమావేశంలో మంత్రి తుపాకీని తీసి కలెక్టర్ వైపు చూపించడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ధర్మపురి జిల్లాకు చెందిన డీఎంకే మాజీ మంత్రి ముల్లైవేందన్, అతని ప్రవర్తన పార్టీకి కళంకం తెచ్చేవిధంగా ఉండడం వలన అతడిని డీఎంకే పార్టీ నుంచి తొలగించారు. అనంతరం ఆయన డీఎండీకేలో చేరారు.
Advertisement