సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బుచ్చిబాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తు, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రామచంద్ర పిళ్లైకి చార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించాడు గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణ కాగా.. గతంలోనూ సీబీఐ కూడా అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో, తద్వారా హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ లైసెన్సీలకు లాభం చేకూర్చడంలో పాత్ర పోషించినందుకు గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: ఉప్పు-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!!
సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేతులు మారడంలో బుచ్చిబాబు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పనిచేసినట్లు ఆ మధ్య కొన్నికథనాలు కూడా తెరపైకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment