బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు కథ ఎట్టకేలకు ముగిసిపోయింది. ఈ కేసులో నిందితులుగా వున్న 32మంది నిర్దోషులని బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. వాస్తవానికి ఇందులో మొత్తం 49మంది నిందితులుకాగా... బాల్ ఠాక్రే, మహంత్ అవైద్యనాథ్, అశోక్ సింఘాల్‌తోసహా 17మంది మరణించారు. 1992 డిసెంబర్ 6న జరిగిన మసీదు కూల్చివేతలో ముందస్తు పథకం లేదని, ఈ విషయంలో సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలు నిందితులను శిక్షించడానికి సరిపోవని కోర్టు తేల్చింది. ఆశ్చర్యకరమేమంటే ఈ ఉదంతంలో కుట్ర దాగుందని అప్పట్లో పీవీ నరసింహారావు ప్రభుత్వం నియమించిన న్యాయవిచారణ కమిషన్‌కు నేతృత్వంవహించిన జస్టిస్ మన్మోహన్‌సింగ్ లిబర్హాన్ 2009లో అభిప్రాయపడ్డారు. అసలు ఈ కేసు న్యాయస్థానాల్లో నడిచిన తీరు గమనిస్తే ఎవ రైనా ఆశ్చర్యపోతారు. రామజన్మ భూమి–బాబ్రీ మసీదు వివాదం గత ఏడాది నవంబర్‌లో అయి దుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పుతో ముగిసింది.
వివాదా స్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని ధర్మాసనం రామమందిర నిర్మాణానికే అప్పగించింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి చూడాలని, దాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ఆ సివిల్ తగాదాతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత ఉదంతంపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి ‘గుర్తు తెలియని’ కరసేవకు లపై పెట్టిన కేసు కాగా, రెండోది ఈ కుట్ర కేసు. జాతీయ సమగ్రతకు భంగం కలిగించారని, వదం తులు సృష్టించి శాంతిభద్రతలకు భంగం కలిగించారని, అందుకోసం కుట్రకు పాల్పడ్డారని ఈ కేసు లోని అభియోగం. ఇందులో మొదటి కేసు లక్నో సెషన్స్ కోర్టులో, రెండోది రాయ్‌బరేలీ కోర్టులో పాతికేళ్లపాటు కొనసాగాయి. మధ్యలో 2001లో కుట్ర కేసు అభియోగాలు చెల్లబోవని రాయ్‌బరేలీ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని 2010లో అలహాబాద్ హైకోర్టు కూడా ధ్రువీకరించింది. కానీ సుప్రీంకోర్టు 2017లో దీన్ని అంగీకరించలేదు.
అసలు ఒకే స్వభావం వున్న రెండు వేర్వేరు కేసులను ఇలా రెండు చోట్ల విచారించడంలో అర్థమేముందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించి, వాటిని విలీనం చేసి విచారించాలని చెప్పడంతో కుట్ర కేసు విచారణ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ కేసును సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ ప్రాతిపదికన విచారణ సాగించి రెండేళ్లలో తీర్పునివ్వాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలుగా సమర్పించిన డాక్యుమెంట్లు దాదాపు 800 కాగా, వందలసంఖ్యలో ఆడియో, వీడియోలు, వేర్వేరు ఫైళ్లు వున్నాయి. 351మంది సాక్షులున్నారు. వివిధ పక్షాల న్యాయవాదుల వాదనలు సరేసరి. కనుక ఇంత విస్తృతమైన, సంక్లిష్టమైన కేసు గనుకే సర్వో న్నత న్యాయస్థానం ఆదేశించిన గడువులోగా తీర్పునివ్వడం సాధ్యపడలేదని దీన్ని విచారించిన ఎస్‌కే యాదవ్ చెప్పడంలో వాస్తవం ఉండొచ్చు.
ఈ కేసులో ఆనాటి ఐపీఎస్ అధికారిణి అంజూ గుప్తా, అప్పట్లో ఈ ఉదంతాన్ని మీడియా ప్రతి నిధిగా దగ్గరుండి చూసిన రాధికా రామశేషన్ ఇచ్చిన సాక్ష్యాధారాలు నిందితుల ప్రమేయాన్ని రుజువు చేస్తాయని భావించినవారున్నారు. ఆరోజు మసీదు వద్దకు వచ్చిన కరసేవకుల చేతుల్లో దాన్ని కూల్చ డానికి కావలసిన ఉపకరణాలున్నాయని, ముందస్తు ప్రణాళిక లేనప్పుడు అదెలా సాధ్యమని రాధికా రామశేషన్ ప్రశ్నించారు. వారు ఆ పని కానిస్తుండగా ఉమాభారతి వారిని ఉత్సాహపరచడం కళ్లారా చూశానని, ఆమె మాటలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని చెప్పారు. కూల్చివేత పనులు సాగుతుండగా, అది పూర్తియ్యేవరకూ కదలొద్దని నాయకులు వారిని ఆదేశించారన్నది ఐపీఎస్ అధి కారి అంజూగుప్తా మాట.
అయితే న్యాయస్థానాలు కేవలం వారి మౌఖిక సాక్ష్యాధారాలపైనే ఆధార పడటం సాధ్యం కాదు. వాటిని నిర్ధారించే ఇతరత్రా సాక్ష్యాలు కూడా వుండాలి. అప్పుడు మాత్రమే నిందితుల ప్రమేయాన్ని విశ్వసిస్తాయి. సీబీఐ ఆ విషయంలో ఎంతవరకూ కృతకృత్యమైందో, అది సమర్పించిన సాక్ష్యాధారాలేమిటో ప్రత్యేక కోర్టు వెలువరించిన 3,000 పేజీల తీర్పు పూర్తి పాఠం బయటికొస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. అలాగే లిబర్హాన్ కమిషన్ సేకరించిన సాక్ష్యాధారాలేమైనా ప్రత్యేక కోర్టు పరిశీలించిందా...ఆ విషయంలో సీబీఐని ఏమైనా నిలదీసిందా అన్నది కూడా చూడాలి. బాబ్రీ మసీదు కట్టడంపై వందేళ్లనుంచి వివాదం నడుస్తోంది. అయితే ఆ ప్రాంగణంలోకి ప్రైవేటు వ్యక్తులు చొరబడి, ఆ కట్టడాన్ని ధ్వంసం చేయడాన్ని ఏ చట్టమూ అంగీకరించదు.
కనుక ఆ రోజున అక్కడ విధ్వంసానికి దిగినవారు చట్టం దృష్టిలో దోషులే. ఈ కేసు విచారణ జరపాల్సిందేనని 2017లో చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టిలో అయితే ఇలా కూల్చివేతకు పాల్పడటం ‘ఒక అసా ధారణమైన చట్ట ఉల్లంఘన’. ఇప్పుడు వెలువడిన తీర్పు గమనిస్తే సీబీఐ పకడ్బందీ సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయిందన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. న్యాయస్థానాలు తమముందున్న సాక్ష్యాధారాలు గమనిస్తాయి తప్ప వాస్తవంగా ఏం జరిగి వుండొచ్చునన్న ఊహాగానాలపై ఆధారపడవు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు తన జీవితంలో అత్యంత విషాకరమైన దినమని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ, మాజీ ప్రధాని వాజపేయి అనంతరకాలంలో వ్యాఖ్యానించారు.
బహుశా బాబ్రీ విధ్వంసం తర్వాత జరిగిన పరిణామాలు వారికి ఆ అభిప్రాయం కలిగించివుండొచ్చు. బాబ్రీ వివాదం మొదల య్యాక దేశంలో ఏర్పడ్డ వైషమ్య భావాలు ఆ కట్టడం కూల్చివేతతో పరాకాష్టకు చేరాయి. దేశ వ్యాప్తంగా జరిగిన మత కల్లోలాల్లో 2,000మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పతాక శీర్షికల కెక్కిన ఈ మాదిరి కేసుల్లో సైతం సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడం, కేసు విచార ణకు ఇరవైఎనిమిది సంవత్సరాలు పట్టడం, వందలమంది పాల్గొన్న విధ్వంస ఉదంతంలో చివరకు ఒక్కరినైనా శిక్షించలేకపోవడం సాధారణ పౌరులకు ఆశ్చర్యం కలిగించకమానదు.
Comments
Please login to add a commentAdd a comment