
ఫలించిన ప్రజల దీవెనలు
ప్రజల దీవెనలు ఫలించాయి. పదహారు నెలలుగా తమ నాయకుడి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల గుండెలు ఆనందంతో నిండిపోయాయి.
హైదరాబాద్ : ప్రజల దీవెనలు ఫలించాయి. పదహారు నెలలుగా తమ నాయకుడి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల గుండెలు ఆనందంతో నిండిపోయాయి. భర్త దూరమైన బాధనుంచి కోలుకోకముందే... కొడుకును కుట్రలు నిర్బంధించినా... పెద్ద బాధ్యతను భుజానికెత్తుకుని పోరాడిన ఆ తల్లి ఓర్పుకి తగిన ఫలితం లభించింది. అన్న ప్రతినిధిగా ప్రజల మధ్యకు సుధీర్ఘ ప్రయాణం చేసిన చెల్లెలు ప్రస్థానానికి తగిన న్యాయం జరిగింది. కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు అభిమన్యుడు కాదు... జనమందరిలో ఒకడని... జననాయకుడని ఎలుగెత్తిన రోజు వచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి ఈ సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు జగన్కు నిన్న సాయంత్రం బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు కోరిన షూరిటీలు సమర్పించిన తరువాత జగన్ విడుదల ఉత్తర్వులపై న్యాయమూర్తి దుర్గాప్రసాద్రావు మంగళవారం సంతకం చేశారు. కోర్టు సిబ్బంది ఆ ఉత్తర్వులను చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు. కోర్టు ఆదేశాలను పరిశీలన తర్వాత జైలు అధికారులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విడుదల చేశారు.
గతంలో ఉన్న విధంగా ప్రభుత్వం బులెట్ ప్రూఫ్ వాహనాన్ని, భద్రతా సిబ్బందిని సమకూర్చింది. జగన్ విడుదల సందర్భంగా జైలు వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.