బెయిల్‌ రద్దుకే కుట్ర.. బాధితుడు జగనే | YSRCP Clarification in letter addressed to YS Vijayamma | Sakshi
Sakshi News home page

బెయిల్‌ రద్దుకే కుట్ర.. బాధితుడు జగనే

Published Wed, Oct 30 2024 4:52 AM | Last Updated on Wed, Oct 30 2024 1:10 PM

YSRCP Clarification in letter addressed to YS Vijayamma

వైఎస్‌ విజయమ్మను ఉద్దేశించి రాసిన లేఖలో వైఎస్సార్‌సీపీ స్పష్టీకరణ 

బెయిల్‌ రద్దు కుట్రను విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదు?

దీనిపై వైఎస్సార్‌ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. 

సరస్వతీ షేర్ల బదిలీని వారిస్తూ రిటైర్డ్‌ జడ్జీలు న్యాయ సలహా ఇచ్చినప్పటికీ  కుట్రపూరితంగా బదిలీ చేయడం గురించి విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదు?  

జగన్‌కు న్యాయపరంగా చిక్కులు సృష్టించే పత్రాలను ఆమె ఆమోదించి సంతకం చేయడం నిజం కాదా?  

ఉమ్మడి ఆస్తులైతే ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు?  

కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ ఎందుకు? చెల్లెలి పట్ల ప్రేమతో తన స్వార్జిత ఆస్తుల్లో వాటా ఇస్తున్నట్లు ఎంవోయూలో జగన్‌ స్పష్టంగా చెప్పారు 

దాన్ని ఆమోదిస్తూ ఎంవోయూపై విజయమ్మ, షర్మిల సంతకాలు చేశారు.. అంటే జగన్‌ స్వార్జిత ఆస్తుల్లో తమకు హక్కు లేదని వారు అంగీకరించినట్లే కదా? 

ఆ కంపెనీల్లో తమకు వాటాలున్నాయంటూనే వాటిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తారా?.. నిజంగానే వాటాదారులైతే ఇలా చేస్తారా? 

గత నాలుగేళ్లుగా టీడీపీ నేతలతో కుమ్మక్కై షర్మిల అడుగులు.. 

విజయవాడలో జగన్‌పై దాడి జరిగితే హేళన చేస్తూ వ్యాఖ్యలు 

వైఎస్సార్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతోపాటు జగన్‌ను జైలు పాలు చేసిన కాంగ్రెస్‌కు ఓటేయమని  ఎన్నికలకు కొద్ది గంటల ముందు వీడియోలో విజయమ్మ ఎలా చెబుతారు? 

రచ్చకెక్కిందీ... కుటుంబ పరువు తీసిందీ షర్మిలే  

ఇన్ని జరిగినా.. చెల్లిని ఏనాడూ ఒక్క మాట అనని జగనే బాధితుడు 

కోర్టులే అంతిమ నిర్ణేతలు

సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్‌ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్‌ విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది. షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ.. జగన్‌ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలంటూ ఎన్నికలకు కొద్ది గంటల ముందు విజయమ్మ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేసినప్పుడు వైఎస్సార్‌ అభిమానులు తీవ్రంగా కలతచెందారని తెలిపింది. 

వైఎస్‌ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్‌సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది. షర్మిల ఎన్నో రకాలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్‌ ఒక్కరోజు కూడా తన చెల్లెలిని ఒక్క మాట కూడా అనలేదనే విషయాన్ని గుర్తు చేసింది. చెల్లెలుపై ప్రేమాభిమానాలతోనే జగన్‌ తన స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేశారని... అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం  ఉండదు..చట్టా రీత్యా హక్కు వస్తుంది కదా? అని పేర్కొంది. 

అసలైన బాధితుడైన జగన్‌కు బాసటగా ఉండటం విజయమ్మ ధర్మమని స్పష్టం చేసింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణిగా, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాతృమూర్తిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని  పేర్కొంది. వాస్తవాలను ఆమెకు, ప్రజల ముందు ఉంచేందుకు వైఎస్సార్‌సీపీ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం ఇదీ... 

కాంగ్రెస్‌కు ఓటేయమని విజయమ్మ ఎలా అంటారు? 
ఆనాడే వైఎస్సార్‌ అభిమానులు తీవ్ర కలత చెందారు 
2024 ఎన్నికల్లో జగన్‌ ఒక్కరే ఒకవైపున ఉంటే... అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు అంతా జట్టు కట్టారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టికి, తన కుమారుడు జగన్‌ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్‌ పార్టికి ఓటేయమని కోరుతూ విజయమ్మ వీడియో విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెడుతూ.. తాను షర్మిలవైపు ఉన్నాననే విషయాన్ని తద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. 

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్‌ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా..! రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు...కనీసం తటస్థ వైఖరిని మరిచిపోయి పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్సార్‌ అభిమానులు తీవ్ర కలత చెందారు. బాధపడ్డారు.  

సర్టిఫికెట్లు పోయాయని..  మోసపూరితంగా షేర్ల బదలాయింపు 
సరస్వతీ కంపెనీ వ్యవహారంలో షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో షేర్ల సర్టిఫికెట్లు పోయాయని విజయమ్మ చెప్పారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు లేకుండానే, జగన్‌ సంతకాలు లేకుండానే ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా షేర్లు బదిలీ చేశారు.  తన కుమారుడికి న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని, అది బెయిల్‌ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసినా అలా చేశారు. తద్వారా తాను షర్మిలతోనే ఉన్నానని మరోసారి స్పష్టంగా చెప్పారు.  

షర్మిలను ఏనాడూ ఒక్క మాట అనని జగన్‌.. 
వైఎస్‌ జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ టీడీపీ సోషల్‌ మీడియా ఖాతాలో ప్రత్యక్షమైంది. విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏమిటి...? ఇంత జరిగినా జగన్‌ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడ లేదు. కానీ షర్మిల ఎన్నోసార్లు వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికల సమయంలో విజయవాడలో జగన్‌పై దాడి జరిగితే హేళనగా మాట్లాడారు. షర్మిలను సరిదిద్దాలని విజయమ్మ ఏనాడూ ప్రయత్నించకపోవడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి.  

బాధితుడు జగనే... 
కోర్టు కేసులపై ప్రతికూల ప్రభావితం పడేలా షర్మిల ప్రవర్తన, చర్యలు ఉంటున్నాయి. ఓ వైపు ఆస్తులపై హక్కులు కోరుతూ మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులపై వైఎస్‌ జగన్‌ పోరాటం చేస్తుంటే... వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై తనకు ఎలాంటి ఆందోళనలేనట్టు ఆమె ప్రవర్తిస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనుగుణంగానే ఆమె వ్యవహరిస్తున్నారు.  షర్మిల వేసే ప్రతి అడుగూ ప్రత్యర్థులకు లబ్ధి చేకూర్చేలా ఉంటోంది. మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా జగన్‌ ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు...? ఒక తల్లిగా విజయమ్మ ఎవరికి బాసటగా ఉండాలనే బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.  

రచ్చ కెక్కిందీ... పరువు తీసిందీ షర్మిలే 
రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి  జగన్‌ను షర్మిల ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన పార్టికి... అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టికి ఈ  రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వచ్చారు. 

రాజకీయాలు ఇంతే అనుకున్నా ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి ఆజన్మ శత్రువు మాదిరిగా జగన్‌ను షర్మిల అనరాని మాటలు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్‌పై దాడి జరిగితే ఎగతాళి చేసి అమానవీయంగా మాట్లాడింది షర్మిల  కాదా..? వీటన్నింటినీ జగన్‌ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు... పరువుతీసింది ఎవరు... నిజమైన బాధితుడు ఎవరు... జగనే కదా..!!  



విచక్షణ విస్మరించిన విజయమ్మ 
కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లతో విజయమ్మ విచక్షణ విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణితో సరస్వతీ కంపెనీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. ఉమ్మడి ఆస్తులే అయితే ఒకరి కంపెనీల్లో ఒకరికి ఎందుకు వాటాలు లేవు?  వైఎస్సార్‌ ఆ ఆస్తులను షర్మిలకు ఎందుకు పంచలేదు?  

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నపుడే జగన్‌ కంపెనీలు నడిపారు. అలాగే షర్మిల తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైఎస్సార్‌ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగింది ? తన కుమార్తెకు వైఎస్సార్‌ పూరీ్వకుల ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చారు. జగన్‌ ఆస్తులు తనవి కాదు కాబట్టే ఇవ్వలేదు. ఎందుకంటే అవన్నీ జగన్‌ స్వార్జితం కాబట్టి.  

తన స్వార్జిత ఆస్తులను షర్మిలకు ఇచ్చిన జగన్‌ 
షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తర్వాత జగన్‌ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు జగన్‌ ద్వారా షర్మిల పొందినా ఆమె తన సోదరుడిపట్ల ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు.  

షర్మిల ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా ?  
ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా?  

వాటాలు ఉంటే ఇలా నష్టం చేస్తారా?  
ఈ కంపెనీల మీద, జగన్‌ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా షర్మిల వారిని బలపరుస్తున్నారు. కంపెనీలను బలహీనపరుస్తున్నారు. ఆమె నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే ఇలా చేస్తారా? ఇలా జగన్‌ను, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా?
 
కోర్టులే నిర్ణయిస్తాయి 
ఇప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.

ఉమ్మడి ఆస్తులే అయితే ఎంవోయూ ఎందుకు?  
తన స్వార్జిత ఆస్తులను ప్రేమానురాగాలతో షర్మిలకు ఇస్తున్నట్లు జగన్‌ ఎంఓయూ రాస్తే... దానిపై విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్‌ స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని, ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కదా. నిజంగా ఉమ్మడి ఆస్తులే అయితే వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదు... చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతి కుటుంబానికి తెలుసు.  

జగన్‌ స్వార్జిత ఆస్తి కోసం షర్మిల యాగీ ఏమిటి?  
జగన్‌ స్వార్జితమైన ఆస్తిలో ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో తనకు భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి తన ప్రేమానురాగాలను చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏం చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని జగన్‌ ఇదివరకే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్‌ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టం చేసింది.  

బెయిల్‌ రద్దు కుట్రను విజయమ్మ ఎందుకు ప్రస్తావించ లేదు?
ప్రజలను పక్కదోవ పట్టించడమే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని న్యాయపరంగా ఇబ్బంది పెట్టేందుకు... తద్వారా బెయిల్‌ రద్దుకు పన్నిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ తన లేఖలో కనీసం ప్రస్తావించ లేదు. అది ప్రజలను పక్కదోవ పట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్‌మెంట్‌ ఉంది. తెలంగాణ హైకోర్టు స్టేటస్‌కో ఆదేశాలు ఉన్నాయి. యాజమాన్య బదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని అటాచ్‌మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలుసు. 

సరస్వతీ కంపెనీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జీలతో సహా పలువురి న్యాయసలహాలు ఉన్నాయి. అయినప్పటికీ తప్పని తెలిసినప్పటికీ.. మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా...! షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా...! విజయమ్మ తన లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులను పక్కదోవ పట్టించడమే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement