విజయసాయిరెడ్డికి బెయిల్
షరతులతో మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. వ్యకిగత పూచీకత్తుతో పాటు రూ. 2 లక్షల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు బాండ్లు సమర్పించి బెయిల్ పొందాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఆదేశించారు. న్యాయస్థానం అనుమతి లేనిదే హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ఎప్పుడైనా కోర్టును కోరవచ్చని పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేసిన సీబీఐ... ఆ వాదనకు బలమైన ఆధారాలను చూపలేదని, ఈ దృష్ట్యా సాయిరెడ్డి బెయిల్ పొందడానికి అర్హుడేనని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. బెయిల్ ఉత్తర్వులు వెలువరించే సమయానికి కోర్టు సమయం ముగియడంతో... పూచీకత్తు బాండ్లను సాయిరెడ్డి తరఫు న్యాయవాది బుధవారం కోర్టుకు సమర్పించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత సాయిరెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.