కోర్టుకు హాజరైన జగన్ | YS Jaganmohan Reddy appears before CBI court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన జగన్

Published Fri, Oct 18 2013 2:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS Jaganmohan Reddy appears before CBI court

సాయిరెడ్డి, సబిత ఇతర నిందితులూ హాజరు
కేసు విచారణ ఈనెల 31కి వాయిదా


 సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, శామూల్, వెంకట్‌రామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్‌దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరుకాగా... ఐఏఎస్ అధికారులు మన్మోహన్‌సింగ్, శ్రీలక్ష్మి, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డితోపాటు ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది.
 
 అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించగా, శ్రీకాకుళం జిల్లాలో వరదల కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నారని మాజీ మంత్రి ధర్మాన  తరఫు న్యాయవాది నివేదించగా... అందుకు కోర్టు అనుమతించింది. ఇతర నిందితుల హాజరును నమోదు చేసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేశారు. జగన్ కంపెనీల్లో ఫార్మా సంస్థల పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న ఏపీఐఐసీ మాజీ జోనల్ మేనేజర్ వై.విజయలక్ష్మీప్రసాద్ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement