
పర్యటనకు అనుమతించాలన్న జగన్ పిటిషన్ 12కు వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.
సమైక్యాంద్రకు మద్దతు కూడగట్టేందుకు తాను పశ్చిమబెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులను ఆ మేరకు సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.
తన బెయిల్ షరతులను సడలించిన సీబీఐ ప్రత్యేక కోర్టు... రాష్ట్రవ్యాప్తంగాను, ఢిల్లీ వెళ్లేందుకు మాత్రం అనుమతిస్తూ గతనెల 30న ఉత్తర్వులు జారీచేసిందని జగన్ తన పిటిషన్లో తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతో పాటు పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదన్నారు. తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు.