
18న జగన్ హాజరుకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: లేపాక్షి నాలెడ్జి హబ్‌పై చార్జిషీట్‌లో ఈనెల 18న కోర్టులో తన హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. హాజరుకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సీబీఐ మూడో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంవీ రమణనాయుడు గురువారం విచారించారు. కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జి హబ్‌పై సెప్టెంబర్ 17న సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో జగన్ సహా ఇతర నిందితులను నవంబర్ 15న హాజరుకావాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగన్ 15న కోర్టు ముందు హాజరై, 16న ఢిల్లీ వెళ్లి 19వ తేదీ వరకు జాతీయ పార్టీల ముఖ్య నేతలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టుకు నివేదించారు. మొహర్రం సెలవును 14 నుంచి 15వ తేదీకి మార్పు చేసిన నేపథ్యంలో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. 18న జరిగే విచారణకు జగన్ హాజరుకు మినహాయింపునిచ్చారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ రోజున పూచీకత్తు బాండ్లు సమర్పించాలని షరతు విధించారు. కాగా, జగన్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లి, ఈనెల 19న తిరిగి హైదరాబాద్‌కు వస్తారని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు సమాచారమిచ్చారు.
లేపాక్షి కేసు విచారణ 18కి వాయిదా
లేపాక్షి నాలెడ్జి హబ్ చార్జిషీట్‌పై కోర్టు విచారణ ఈనెల 18కి వాయిదా పడింది. ఈ విచారణకు తొలుత 15న హాజరు కావాలంటూ నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే మొహర్రం సెలవును ప్రభుత్వం 14 నుంచి 15వ తేదీకి మార్పు చేసిన నేపథ్యంలో నిందితుల హాజరును 18కి మార్పుచేస్తూ సీబీఐ రెండో అదనపు జడ్జి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.