
ఐదు చార్జిషీట్లలో ఒకేసారి వాదనలు
జగన్ పిటిషన్‌ను అనుమతించిన కోర్టు
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఐదు చార్జిషీట్లలో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లను, అభియోగాల నమోదు ప్రక్రియను ఒకేసారి చేపట్టాలన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేకకోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఉత్తర్వులు జారీచేశారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులతోపాటు అరబిందో, హెటిరో, రాంకీ, వాన్‌పిక్, దాల్మియా సంస్థల పెట్టుబడులకు సంబంధించి దాఖలు చేసిన ఐదు చార్జిషీట్లను కలిపి విచారించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అన్ని చార్జిషీట్లలో నిందితునిగా ఉన్నందున డిశ్చార్జ్ పిటిషన్లపై ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒక్కో చార్జిషీట్‌లో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై వేర్వేరుగా తమ వాదన వినిపించాలనడం సరికాదన్నారు.
ఈ వ్యవహారంలో తామెలాంటి తప్పుచేయలేదని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను వెల్లడిస్తే, సీబీఐ ఆ లోపాలను సరిచేసుకొని ఇతర చార్జిషీట్లలో తమకు వ్యతిరేకమైన వాదనను వినిపించే అవకాశం ఉందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఐదు చార్జిషీట్లలో డిశ్చార్జ్, అభియోగాల నమోదుకు సంబంధించిన వాదనలు వినేందుకు అనుమతించారు. అయితే అన్ని చార్జిషీట్లను కలిపి తుది విచారణ (ట్రయల్)ను చేపట్టాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇదిలాఉండగా ఇదే కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఈ నెల 25 నుంచి జూన్ 30 వరకు హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.