దిను సోలంకి
అహ్మదాబాద్: ఆర్టీఐ కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీతోపాటు ఆరుమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గిర్ అరణ్య ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను పిల్ ద్వారా వెలుగులోకి తేవడంతో జెత్వాను 2010లో నాటి జునాగఢ్ ఎంపీ దిను సోలంకి హత్య చేశారు. ఈ అక్రమ మైనింగ్‌లో సోలంకి ఉన్నాడని జెత్వా తన పిల్‌లో పేర్కొనడమే ఈ హత్యకు కారణం. దోషులు సోలంకి, అతడి మేనల్లుడు శివలకు జీవిత ఖైదుతోపాటు రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ జడ్జి కేఎం దేవ్ గురువారం తీర్పునిచ్చారు.
వీరితోపాటు శైలేష్ పాండ్య, బహదూర్‌సిన్హ్ వాధెర్, పంచన్ దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉడాజి ఠాకూర్‌లకు జీవిత ఖైదు విధించింది. 2010లో ఓ వైపు జెత్వా దాఖలు చేసిన పిల్‌పై వాదనలు జరుగుతుండగానే గుజరాత్ హైకోర్టు ప్రాంగణంలో అమిత్ జెత్వా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును విచారించిన అహ్మదాబాద్ పోలీసులు బీజేపీ ఎంపీ దిను సోలంకికి క్లీన్‌చిట్ ఇచ్చారు. సంతృప్తి చెందని మృతుడు అమిత్ జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అందుకు అంగీకరించడంతో సీబీఐ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేసును పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, తమ కుటుంబానికి న్యాయం అందిందని తీర్పు అనంతరం భిఖాభాయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment