Dinu Bogha Solanki
-
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదు
అహ్మదాబాద్: ఆర్టీఐ కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీతోపాటు ఆరుమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గిర్ అరణ్య ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను పిల్ ద్వారా వెలుగులోకి తేవడంతో జెత్వాను 2010లో నాటి జునాగఢ్ ఎంపీ దిను సోలంకి హత్య చేశారు. ఈ అక్రమ మైనింగ్‌లో సోలంకి ఉన్నాడని జెత్వా తన పిల్లో పేర్కొనడమే ఈ హత్యకు కారణం. దోషులు సోలంకి, అతడి మేనల్లుడు శివలకు జీవిత ఖైదుతోపాటు రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ జడ్జి కేఎం దేవ్ గురువారం తీర్పునిచ్చారు. వీరితోపాటు శైలేష్ పాండ్య, బహదూర్‌సిన్హ్ వాధెర్, పంచన్ దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉడాజి ఠాకూర్లకు జీవిత ఖైదు విధించింది. 2010లో ఓ వైపు జెత్వా దాఖలు చేసిన పిల్‌పై వాదనలు జరుగుతుండగానే గుజరాత్ హైకోర్టు ప్రాంగణంలో అమిత్ జెత్వా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును విచారించిన అహ్మదాబాద్ పోలీసులు బీజేపీ ఎంపీ దిను సోలంకికి క్లీన్చిట్ ఇచ్చారు. సంతృప్తి చెందని మృతుడు అమిత్ జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అందుకు అంగీకరించడంతో సీబీఐ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేసును పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, తమ కుటుంబానికి న్యాయం అందిందని తీర్పు అనంతరం భిఖాభాయ్ పేర్కొన్నారు. -
సీబీఐ కస్టడీకి బీజేపీ ఎంపీ సోలంకి
న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన ఆర్టీఐ(సమాచార హక్కు) ఉద్యమ నేత అమిత్ జెత్వా దారుణ హత్య కేసులో అరెస్టయిన బీజేపీ ఎంపీ దిను బొఘా సోలంకిని ఈనెల 11 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కోసం ఆయనను 14 రోజుల కస్టోడియల్ రిమాండ్‌కు అనుతించాలని న్యాయస్థానాన్ని సీబీఐ తరపు న్యాయవాది కుమార్ రజత్ కోరారు. నాలుగు రోజుల పాటు రిమాండ్‌కు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్ జీ పాండ్య అనుమతించారు. రిమాండ్ సమయంలో ప్రతిరోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దిను బొఘా సోలంకిని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఎంపీ ఇచ్చిన సమాధానం తమను సంతృప్తి పరచలేదని అందుకే అరెస్టు చేశామని సీబీఐ అధికారి కాంచన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. గుజరాత్‌లోని గిర్ అడవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అమిత్ జెత్వా అనే ఆర్టీఐ ఉద్యమ నేత పోరాటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2010, జులై 20న గుజరాత్ హైకోర్టు వెలుపల జెత్వాను కొందరు తుపాకీతో కాల్చి చంపారు. రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమచారంతో ఎంపీ సోలంకికి సమీప బంధువు శివ సోలంకి, షార్ప్ షూటర్‌గా పేరొందిన శైలేష్ పాండేలు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. -
ఆర్టీఐ నేత హత్య కేసులో గుజరాత్ బీజేపీ ఎంపీ అరెస్ట్
నేడు కోర్టులో ప్రవేశ పెడతామన్న సీబీఐ న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన ఆర్టీఐ(సమాచార హక్కు) ఉద్యమ నేత అమిత్ జెత్వా దారుణ హత్య కేసులో ఆ రాష్ట్రంలోని జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ దిను బొఘా సోలంకిని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఎంపీ ఇచ్చిన సమాధానం తమను సంతృప్తి పరచలేదని అందుకే అరెస్టు చేశామని సీబీఐ అధికారి కాంచన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. సోలంకిని బుధవారం ఢిల్లీ కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు. వివరాలు.. గుజరాత్‌లోని గిర్ అడవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అమిత్ జెత్వా అనే ఆర్టీఐ ఉద్యమ నేత పోరాటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2010, జులై 20న గుజరాత్ హైకోర్టు వెలుపల జెత్వాను కొందరు తుపాకీతో కాల్చి చంపారు. రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమచారంతో ఎంపీ సోలంకికి సమీప బంధువు శివ సోలంకి, షార్ప్ షూటర్‌గా పేరొందిన శైలేష్ పాండేలు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఎంపీ సోలంకిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్యలో ఆయన ప్రమేయం కూడా ఉందని విపక్షాలు దుయ్యబట్టాయి. అయితే, రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు మాత్రం హత్యతో ఎంపీ సోలంకికి ఎలాంటి ప్రమేయమూ లేదని క్లీన్చిట్ ఇచ్చారు. దీంతో మృతుని తండ్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు హత్య వెనుక ఎంపీ ప్రమేయంపై జైల్లో ఉన్న నిందితులను ప్రశ్నించారు. అనంతరం, ఎంపీని కూడా ప్రశ్నించాలని నిర్ణయించి మంగళవారం ఉదయమే ఆయనను స్థానిక సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. రోజంతా సాగిన విచారణ అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ ఘటన గుజరాత్లో తీవ్ర చర్చకు దారితీసింది.