ఆర్టీఐ నేత హత్య కేసులో గుజరాత్ బీజేపీ ఎంపీ అరెస్ట్ | BJP MP arrested in Amit Jethwa murder case | Sakshi
Sakshi News home page

ఆర్టీఐ నేత హత్య కేసులో గుజరాత్ బీజేపీ ఎంపీ అరెస్ట్

Published Wed, Nov 6 2013 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

BJP MP arrested in Amit Jethwa murder case

నేడు కోర్టులో ప్రవేశ పెడతామన్న సీబీఐ
 న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన ఆర్టీఐ(సమాచార హక్కు) ఉద్యమ నేత అమిత్ జెత్వా దారుణ హత్య కేసులో ఆ రాష్ట్రంలోని జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ దిను బొఘా సోలంకిని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఎంపీ ఇచ్చిన సమాధానం తమను సంతృప్తి పరచలేదని అందుకే అరెస్టు చేశామని సీబీఐ అధికారి కాంచన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. సోలంకిని బుధవారం ఢిల్లీ కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు. వివరాలు.. గుజరాత్‌లోని గిర్ అడవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అమిత్ జెత్వా అనే ఆర్టీఐ ఉద్యమ నేత పోరాటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2010, జులై 20న గుజరాత్ హైకోర్టు వెలుపల జెత్వాను కొందరు తుపాకీతో కాల్చి చంపారు. రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమచారంతో ఎంపీ సోలంకికి సమీప బంధువు శివ సోలంకి, షార్ప్ షూటర్‌గా పేరొందిన శైలేష్ పాండేలు సహా ఆరుగురిని అరెస్టు చేశారు.

 

ఈ క్రమంలో ఎంపీ సోలంకిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్యలో ఆయన ప్రమేయం కూడా ఉందని విపక్షాలు దుయ్యబట్టాయి. అయితే, రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు మాత్రం హత్యతో ఎంపీ సోలంకికి ఎలాంటి ప్రమేయమూ లేదని క్లీన్‌చిట్ ఇచ్చారు. దీంతో మృతుని తండ్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు హత్య వెనుక ఎంపీ ప్రమేయంపై జైల్లో ఉన్న నిందితులను ప్రశ్నించారు. అనంతరం, ఎంపీని కూడా ప్రశ్నించాలని నిర్ణయించి మంగళవారం ఉదయమే ఆయనను స్థానిక సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. రోజంతా సాగిన విచారణ అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ ఘటన గుజరాత్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement