సీబీఐ వేధిస్తోందని అనంతపురం ఎస్పీకి 2021, నవంబర్ 29న ఫిర్యాదు చేస్తున్న గంగాధర్ రెడ్డి(ఫైల్)
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనేందుకు తాజా ఉదంతమే మరో ఉదాహరణ. నిజానిజాలు తెలుసుకోకుండా బురద చల్లడమే లక్ష్యంగా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతానికి ఇది మరో తార్కాణం. కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం పేరిట సీబీఐ ఆడిన డ్రామా బెడిసికొట్టింది. సీఐ శంకరయ్య, డీఎస్పీ వాసుదేవన్ చెప్పని విషయాలను వారి వాంగ్మూలాల పేరిట మీడియాలో ప్రచారం చేయాలన్న ఎత్తుగడలు విఫలం కావడంతో అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం పేరిట తాజాగా మరో లీక్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
వాస్తవం ఏమిటంటే...
వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నట్లు కల్లూరు గంగాధర్‌రెడ్డి గత ఏడాది నవంబర్ 29న అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని కోరుతూ సీబీఐ అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు.
గంగాధర్‌రెడ్డి ఫిర్యాదులో ప్రధానాంశాలు ఇవీ..
► టీడీపీ హయాంలో సిట్ బృందం సభ్యుడిగా ఉన్న సీఐ శ్రీరామ్ గతంలో నన్ను కడప డీటీసీకి పిలిచి చిత్ర హింసలు పెట్టారు. వైఎస్ వివేకాను హత్య చేయాలని శివశంకర్‌రెడ్డి నన్ను సంప్రదించినట్లుగా ఒప్పుకోవాలని వేధించారు.
► సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా అవే ఒత్తిళ్లు వచ్చాయి. వైఎస్ వివేకాను హత్య చేసినట్లుగా ఒప్పుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని డి.శివశంకర్‌రెడ్డి చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ అధికారులు వేధిస్తున్నారు.
► డి.శివశంకర్‌రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే వైఎస్ వివేకా హత్య జరిగినట్లు వాంగ్మూలంలో పేర్కొనాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ నాపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. 2021 అక్టోబరు 2, 3వ తేదీల్లో రామ్‌సింగ్ నాకు వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్లుగా చెప్పాలని ఆదేశించారు.
► వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత నన్ను సంప్రదించారు. సీబీఐ అధికారులు చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అలా చేస్తే రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు నా రెండు కాళ్లూ బాగు చేయిస్తామన్నారు.
► సీబీఐ అధికారులు నన్ను కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు తరలించి అప్పటికే రాసి ఉన్న వాంగ్మూలంపై సంతకం చేయాలని ఆదేశించారు. అదే వాంగ్మూలాన్ని తరువాత న్యాయస్థానంలో కూడా ఇవ్వాలని ఒత్తిడి చేశారు. కానీ నాకు తెలియని విషయాలను తెలిసినట్లుగా చెప్పలేనని తిరస్కరించా.
► నాకు ప్రాణభయం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.
విచిత్ర ప్రచారం...
► ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావటానికి సంబంధించి నేరాన్ని నాపై వేసుకుంటే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానని చెప్పాడు..’
కల్లూరు గంగాధర్‌రెడ్డి గత అక్టోబర్ 2న వాంగ్మూలం ఇచ్చినట్లు తాజాగా టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం
చిత్రహింసలు...
► ‘వైఎస్ వివేకా హత్య కేసును నాపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తామని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అన్నట్లుగా చెప్పాలని సీబీఐ నన్ను వేధిస్తోంది. ఆయనతోపాటు ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని చెప్పాలని సీబీఐ అధికారులు చిత్ర హింసలు పెట్టారు...’
2021 నవంబర్ 29న అనంతపురం పోలీసులకు కల్లూరు గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment