(ఫైల్‌ఫోటో)
అనంతపురం టవర్ క్లాక్: వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో కుట్ర పూరితంగా ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని కల్లూరు గంగాధర్‌రెడ్డి అలియాస్ కొవ్వేటు గంగాధర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ వివేకా హత్య విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు, వాంగ్మూలాన్ని ఖండించారు. సీబీఐ అధికారులు పిలవడంతో వెళ్లి దర్యాప్తునకు సహకరించానన్నారు. ఈ సందర్భంగా విచారణకు హాజరైనట్లు సంతకం చేయాలంటూ తనతో తెల్ల కాగితంపై సంతకం పెట్టించుకున్నారని వెల్లడించారు. అంతేకానీ వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాత్ర ఉందని తాను ఎలాంటి స్టేట్‌మెంటూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆడియో, వీడియో రికార్డులు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు.
అందుకు ఆధారాలున్నాయి..
తనతో పాటు అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను కేసులో ఇరికించాలనే కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని గంగాధర్‌రెడ్డి తెలిపారు. దీనికి కారణం వివేకానందరెడ్డి కుమార్తె సునీత, జగదీశ్వర్‌రెడ్డి అని పేర్కొన్నారు. హత్యలో ఆ ముగ్గురి ప్రమేయం ఉందని చెప్పాలంటూ జగదీశ్వర్‌రెడ్డి, బాబురెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. తనకు వారు రూ.20 వేల నగదు సైతం ఇచ్చారన్నారు. తాము చెప్పిన విధంగా సీబీఐ అధికారులతో చెబితే రూ.50 లక్షల డబ్బుతో పాటు కారు, తన కాలి చికిత్స ఖర్చులు భరిస్తామంటూ ప్రలోభపెట్టారని వెల్లడించారు.
తన స్నేహితుడు జాఫర్ బ్యాంకు అకౌంట్‌కు జగదీశ్వరరెడ్డి రూ.40 వేలు జమ చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం సీబీఐ అధికారి రామ్‌సింగ్ రూ.20 వేలు ఇచ్చారన్నారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. అయితే తాను వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదన్నారు. గతంలో జగదీశ్వరరెడ్డి ద్వారా సునీత ఫోన్‌లో తనతో మాట్లాడారని గంగాధర్‌రెడ్డి తెలిపారు. డబ్బులిస్తాం... ఆ ముగ్గురికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బలవంతం చేశారన్నారు. జగదీశ్వరరెడ్డి, సునీత నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
దస్తగిరికి డబ్బులెలా వచ్చాయి?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తాను సీబీఐ ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చానంటూ ఈనాడు పత్రిక కథనాన్ని ప్రచురించటాన్ని గంగాధర్‌రెడ్డి ఖండించారు. ఈనాడు, సీబీఐ అధికారులపై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి గతంలో తన వద్దకు వచ్చి ఖర్చులకు కూడా డబ్బుల్లేవని, చాలా ఇబ్బందిగా ఉందని వాపోయాడన్నారు. ఫోన్‌లో వాట్సాప్ మెసేజ్‌లు కూడా పెట్టాడన్నారు. ఇప్పుడు అతడికి ఐస్‌క్రీమ్ పార్లర్ పెట్టేందుకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో విచారించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment