సీబీఐ కస్టడీకి బీజేపీ ఎంపీ సోలంకి
న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన ఆర్టీఐ(సమాచార హక్కు) ఉద్యమ నేత అమిత్ జెత్వా దారుణ హత్య కేసులో అరెస్టయిన బీజేపీ ఎంపీ దిను బొఘా సోలంకిని ఈనెల 11 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కోసం ఆయనను 14 రోజుల కస్టోడియల్ రిమాండ్కు అనుతించాలని న్యాయస్థానాన్ని సీబీఐ తరపు న్యాయవాది కుమార్ రజత్ కోరారు. నాలుగు రోజుల పాటు రిమాండ్కు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్ జీ పాండ్య అనుమతించారు. రిమాండ్ సమయంలో ప్రతిరోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దిను బొఘా సోలంకిని సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఎంపీ ఇచ్చిన సమాధానం తమను సంతృప్తి పరచలేదని అందుకే అరెస్టు చేశామని సీబీఐ అధికారి కాంచన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు.
గుజరాత్‌లోని గిర్ అడవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అమిత్ జెత్వా అనే ఆర్టీఐ ఉద్యమ నేత పోరాటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2010, జులై 20న గుజరాత్ హైకోర్టు వెలుపల జెత్వాను కొందరు తుపాకీతో కాల్చి చంపారు. రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమచారంతో ఎంపీ సోలంకికి సమీప బంధువు శివ సోలంకి, షార్ప్ షూటర్‌గా పేరొందిన శైలేష్ పాండేలు సహా ఆరుగురిని అరెస్టు చేశారు.