
'నాపై కుట్ర పన్నినా...న్యాయమే గెలిచింది'
బెంగళూరు : ఎట్టకేలకు న్యాయం గెలిచిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. లంచం ఆరోపణల కేసులో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప స్పందిస్తూ తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అప్పట్లో కుట్ర పన్నారని ఆరోపించారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ 'సత్యమేవ జయతే' అంటూ ట్విట్ చేశారు.
తనకు దేవుడిపై, న్యాయస్థానంపై నమ్మకం ఉందని యడ్యూరప్ప పేర్కొన్నారు. కాగా 2011లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, దీని వల్ల దాదాపు రూ.40 కోట్లు ముడుపులు అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యడ్యూరప్ప సహా నలుగురికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
Justice is done, I stand vindicated... Thanks to all well wishers,friends & supporters who stood with me in my tough times...
— B.S. Yeddyurappa (@BSYBJP) October 26, 2016