
నేడు సీబీఐ కోర్టుకు రాజా, కనిమొళి!
కరుణానిధి భార్య దయాళు అమ్మాల్, మరో 16 మందికీ సమన్లు
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఆ పార్టీ అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాల్‌తో పాటు మరో 16 మంది నిందితులు సోమవారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యే అవకాశముంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు గత నెల 2న ఈ కేసు విచారణ ప్రారంభించింది. నిందుతులంతా సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. నిందితుల జాబితాలో స్వాన్ టెలికాం, కుసెగావ్ రియాల్టీ, కళైంజర్ టీవీ, డీబీ రియాల్టీ వంటి 9 సంస్థలతో పాటు కళైంజర్ టీవీ ఎండీ శరత్‌కుమార్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరానీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. 2జీ స్కాంలో భాగంగా నిందితులు మనీ లాండరింగ్‌కు సంబంధించిన కుట్రలు, నేరాలకు పాల్పడ్డారని ఈడీ తన చార్జిషీట్‌లో ఆరోపించింది.
వారిపై అక్రమ లావాదేవీల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. డీఎంకే ఆధ్వర్యంలోని కళైంజర్ టీవీకి చెల్లించినట్లు చెబుతున్న రూ. 200 కోట్లకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని, డీబీ గ్రూప్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి టెలికాం లెసైన్సులు ఇప్పించినందుకు ప్రతిగానే ఆ సొమ్మును లం చంగా ఇచ్చిందని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అప్పటి టెలికాం మంత్రిగా ఉన్న రాజా ప్రధాన పాత్ర పోషించగా.. కళైంజర్ టీవీలో వాటాలున్న దయాళు అమ్మాల్, కనిమొళితో పాటు ఇతర నిందితులు మనీలాండరింగ్‌కు సహకరించారని ఈడీ పేర్కొంది.