
ఇడుపులపాయ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి
బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పాక్షికంగా అనుమతించింది.
షరతులతో సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు
రైలులో వెళ్లి 2వ తేదీన హైదరాబాద్ రావాలని నిర్దేశం
గుంటూరు రైతు సభకు హాజరయ్యేందుకు అనుమతి నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ఇడుపులపాయలో తండ్రి సమాధిని సందర్శించేందుకు, గుంటూరు రైతు సభలో పాల్గొనేందుకు వీలుగా హైదరాబాద్ విడిచి వెళ్లేలా బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పాక్షికంగా అనుమతించింది. దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమాధికి నివాళి అర్పించేందుకు వీలుగా ఇడుపులపాయ వెళ్లేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది. సోమవారం రాత్రి రైలులో వెళ్లి మంగళవారం ఇడుపులపాయలోని తండ్రి సమాధికి నివాళి అర్పించి అదే రోజు రాత్రి తిరిగి రైలులో బయలుదేరి బుధవారం (2వ తేదీ) ఉదయం హైదరాబాద్ చేరుకోవాలని ఆదేశించింది. ఈ సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని, బహిరంగ సభల్లో పాల్గొనరాదని షరతు విధించింది. గుంటూరులో సమైక్యాంధ్రను కోరుతూ ఏర్పాటు చేసిన రైతు సభలో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయలో తండ్రి సమాధిని సందర్శించేందుకు, 3న సీబీఐ కోర్టులో హాజరై తిరిగి 4న గుంటూరులో రైతు సభకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు సోమవారం విచారించారు. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తూ కోర్టు ఇచ్చిన షరతులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించబోమని స్పష్టం చేశారు.
ఆధారాలను మాయం చేస్తారన్న సీబీఐ వాదనలో నిజం లేదని, అన్ని ఆధారాలు డాక్యుమెంట్ల రూపంలో కోర్టులోనే ఉన్నాయని చెప్పారు. సీబీఐ కేవలం యాంత్రికంగానే కౌంటర్ దాఖలు చేసిందని, అపోహలతోనే అనుమతించరాదని కోరుతోందని నివేదించారు. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే తమకే నష్టమని, ఈ నేపథ్యంలో తాము కోర్టు షరతులను తూచా తప్పకుండా పాటిస్తామని స్పష్టంచేశారు. ఇందుకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారని, రాజకీయంగా పలుకుబడి కలిగిన జగన్‌ను ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిస్తే తుది విచారణకు విఘాతమని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర పేర్కొన్నారు. అనేక మంది సాక్షులు హైదరాబాద్ వెలుపలి వారే ఉన్నారని, వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. అయితే సీబీఐ వాదనను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. జగన్ ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అన్ని చార్జిషీట్లు అందిన తర్వాతే డిశ్చార్‌జ పిటిషన్లు
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో డిశ్చార్‌జ (ఈ కేసు నుంచి తమను తొలగించాలని కోరుతూ) పిటిషన్లు దాఖలు చేసే విషయంలో అభిప్రాయం ఏమిటని న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు జగన్ తరఫు న్యాయవాది సుశీల్‌కుమార్‌ను ప్రశ్నించారు. ‘‘ఈ కేసులో సీబీఐ ఇప్పటికి 10 చార్జిషీట్లు దాఖలు చేసింది. అందులో ఐదు మాత్రమే మాకు అందాయి. ఇంకా ఐదు చార్జిషీట్లు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఒక కేసులో ఒక ఎఫ్‌ఐఆర్, ఒక చార్జిషీటే ఉండాలి. కానీ ఈ కేసులో సీబీఐ 10 చార్జిషీట్లు దాఖలు చేసింది. అన్ని చార్జిషీట్లలో జగన్‌ను నిందితునిగా పేర్కొంది. చార్జిషీట్లకు ఒక దానితో మరొక దానికి సంబంధం ఉంది. నిందితుల ప్రస్తావనను పలు చార్జిషీట్లలో చేశారు. ఈ నేపథ్యంలో అన్ని చార్జిషీట్లను పరిశీలించిన వెంటనే డిశ్చార్‌జ పిటిషన్లు దాఖలు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. కోర్టు విలువైన సమయాన్ని ఎంత మాత్రం వృథా చేయం. చార్జిషీట్లు మాకు అందించే వరకూ అనుమతించండి’’ అని సుశీల్‌కుమార్ వివరించారు. అన్ని చార్జిషీట్లను కలిపి విచారించాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు ఈ కేసు నుంచి తమను తొలగించాలని కోరుతూ నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్‌జ పిటిషన్లపై విచారణను కోర్టు వాయిదా వేసింది.
వాదనల సమయంలో నన్ను కోర్టుకు హాజరుపరచండి: సాయిరెడ్డి
తన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించే సమయంలో న్యాయవాదికి సహకరించేందుకు వీలుగా తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచాలని కోరుతూ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సోమవారం మెమో దాఖలు చేశారు. ఈ నెల 4న సాయిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు రానుందని, వాదనల సమయంలో న్యాయవాదికి సహకరించేందుకు వీలుగా సాయిరెడ్డిని హాజరుపరిచేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.