సాక్షి, ఇడుపులపాయ : నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తే భయం పట్టుకుందని ఆ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఒకేసారి మొత్తం అసెంబ్లీ సానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేతుల మీదుగా 175 మంది వైఎస్సాసీపీ ఎమ్మెల్యే అభ్యుర్థుల జాబితా చదివి వినిపించిన అనంతరం ధర్మాన మాట్లాడారు. ఇప్పటికే టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల వరద కొనసాగుతోందని, జాబితా విడుదల చేస్తే మరింత మంది తమ పార్టీలో చేరతారనే భయంతో చంద్రబాబు జాబితా విడుదల చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయం బాబుకు నిన్నటి శ్రీకాకుళం తొలి ఎన్నికల ప్రచార సభలోనే అర్థమైందని అన్నారు.
‘శ్రీకాకుళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ..మీరందరూ ఇంత నిస్తేజంగా ఉంటే ఎలా.. అని అన్నారు. అంటే, వాళ్లు నిస్తేంజంగా, టీడీపీ పట్ల సరైన భావన లేకుండా ఉన్నారని బాబుకు తెలుసు. బాబు ప్రసంగిస్తూ.. ఒకచేయి ఎత్తితే సరిపోదు. రెండు చేతులు ఎత్తండీ అని పిలుపునిచ్చారు. కానీ, ఎవరూ స్పందించలేదు. టీడీపీకి ఘోర పరాజయం తప్పదని బాబుకు ఇండికేషన్ వచ్చింది’ అని ధర్మాన చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఇక 41 మంది బీసీలకు కేటాయించడంతో పాటు అన్ని వర్గాల వారికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రాధాన్యం కల్పించారని అన్నారు. బీసీలకు సీట్లు కేటాయించకుండా మభ్యపెట్టాలని చూస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్వార్డ్ క్లాస్ జాబితాలో వెనకబడిన తరగతుల సీట్లను చేర్చి అసత్యాలు చెప్తున్నారని టీడీపీ తీరును ఎండగట్టారు. ఫార్వార్డ్ క్లాస్‌కు తాము వ్యతిరేకం కాదని, కానీ బీసీలకు టికెట్లు కేటాయించామని టీడీపీ అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment