'సత్యం' కేసు తుది తీర్పు మార్చి 9కి వాయిదా
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు... 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పిం చిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది.కాగా సెబీ కేసులో ఆర్థిక నేరాల కోర్టుకు నిందితులు హాజరయ్యారు. అలాగే ఇదే కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిలిపివేసింది.
2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటాదారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ...ఈ వ్యవహారం లో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా పేర్కొంది.