
రషీద్‌కు నాలుగేళ్ల జైలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రషీద్‌మసూద్‌కు మెడిసిన్ సీట్ల భర్తీ అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. దీంతో ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఆయన తన పదవిని కోల్పోనున్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఏదైనా కేసులో దోషిగా నిర్ధారితులైన వెంటనే.. అనర్హత వర్తిస్తుందంటూ సుప్రీంకోర్టు జూలై 10న సంచలన తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. కింది కోర్టు దోషిగా నిర్ధారించి, శిక్ష విధించనప్పటికీ పై కోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉన్నంతవరకూ అనర్హత వర్తించదంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న నిబంధనను సుప్రీం ఆ తీర్పుతో కొట్టివేసింది.
ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత మొట్టమొదట దోషిగా నిర్ధారితుడై, శిక్షకు గురై పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన నేతగా రషీద్‌మసూద్ (67) రికార్డులకెక్కనున్నారు. రషీద్ 1990లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నపుడు.. దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల్లోని సెంట్రల్ పూల్ నుంచి త్రిపుర రాష్ట్రానికి కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లకు అనర్హులైన అభ్యర్థులను నామినేట్ చేశారన్న నేరంలో ఆయనను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. రషీద్‌కు నాలుగేళ్ల శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పిన ప్రత్యేక న్యాయమూర్తి జె.పి.ఎస్.మాలిక్.. ఆయనను తక్షణమే కోర్టు కస్టడీలోకి తీసుకున్నారు. మసూద్‌కు రూ.60వేల జరిమానా కూడా విధించింది. జైలు నుంచి విడుదలైన ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా అనర్హులన్న నిబంధనల మేరకు ఆయన పదేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా కోల్పోనున్నారు. రషీద్ మసూద్‌తో పాటు.. మాజీ ఐపీఎస్ అధికారి గుర్‌దయాళ్‌సింగ్, అప్పటి త్రిపుర సీఎం రంజన్‌మజుందార్‌కు కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి అమల్ కుమార్‌రాయ్‌లకు కూడా కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది.