
4న గుంటూరులో ట్రాక్టర్ల ర్యాలీకి జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతుల సమావేశంలో, ట్రాక్టర్ల ర్యాలీలో పార్టీ అధ్యక్ష హోదాలో పాల్గొనేందుకు అక్టోబర్4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.
* వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టుకు పిటిషన్
* అక్టోబర్ 1,2 తేదీల్లో ఇడుపులపాయ ప్రయాణానికీ అనుమతించాలని వినతి
* సీబీఐకి నోటీసులు జారీ, విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతుల సమావేశంలో, ట్రాక్టర్ల ర్యాలీలో పార్టీ అధ్యక్ష హోదాలో పాల్గొనేందుకు అక్టోబర్4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించేందుకు అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయకు కూడా అనుమతించాలని ఆయన… కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదంటూ బెయిల్ ఉత్తర్వుల్లో విధించిన… షరతును సడలించాలని ఆయన… కోరారు.
జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్ రెడ్డి గురువారం ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి గుంటూరు ర్యాలీని అక్టోబర్ 1న విజయమ్మ నేతృత్వంలో తలపెట్టడం, అనంతర పరిణామాల్లో జగన్ బెయిల్‌పై విడుదలవడం తెలిసిందే. ర్యాలీకి తాను స్వయంగా సారథ్యం వహించాలని ఆయన భావిస్తున్నారు. అయితే 1, 2 తేదీల్లో ఇడుపులపాయ వెళ్లాలని జగన్ యోచిస్తుండటం, 3న విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో ర్యాలీని 4న జరపాలని యోచిస్తున్నారు. అందులో పాల్గొనేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును జగన్ కోరారు.
‘‘వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశానికి, భారీ ప్రదర్శనకు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. నేతల కోరిక మేరకు, పార్టీ అధ్యక్షునిగా నేను వాటిలో పాల్గొనాల్సి ఉంది. అలాగే నా తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే మిక్కిలి ప్రేమాభిమానాలున్న వ్యక్తిగా ఇడుపులపాయలో ఆయన సమాధిని సందర్శించాలని భావిస్తున్నా. దాంతోపాటు పులివెందులలోని మా పూర్వీకుల ఇంటిని కూడా సందర్శించాలని కోరుకుంటున్నా. సుదీర్ఘకాలంగా రిమాండ్‌లో ఉన్నందున… అక్కడికి వెళ్లలేకపోయా’’ అని పిటిషన్‌లో జగన్ వివరించారు.
పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు... సీబీఐకి నోటీసులు జారీచేస్తూ, విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఈ నెల 23న బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు... ఆయన… హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు విధించిన విషయం తెలిసిందే.
30న గవర్నర్‌ను కలవనున్న జగన్, ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించడానికి వీలుగా తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలసి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు వినతిపత్రం అందించడానికి 30న ఉదయం 11 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఆ రోజున పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలసి సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచాలని కోరనున్నారు.
నేడు స్పీకర్‌తో ఎమ్మెల్యేల భేటీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేయడానికి వీలుగా తక్షణం అసెంబ్లీని సమావేశపర్చాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి కోరనున్నారు. గురువారం ఉదయమే కలవాలని భావించినా, ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల భేటీని వాయిదా వేసుకున్నారు.