ఆత్మహత్యలకు పాల్పడొద్దు
సాక్షి, ముంబై : కరువు ప్రాంతాల్లో పర్యటనలో భాగం గా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరఠ్వాడలోని లాతూర్ జిల్లాలో పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం ఉస్మానాబాద్ జిల్లాకు చేరుకున్నా రు. అక్కడ రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాలోని కరువు పరిస్థితులు, పంటల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా రైతులను ప్రభుత్వం ఆదుకుం టుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన పర్యటన నేపథ్యంలో అక్కడక్కడా కరువును ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సీఎం పర్యటన ముగిసిన తర్వాత స్టాళ్లను ఎత్తివేయడం గమనార్హం. దీంతో రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరువు ప్రాంతాలా.. పర్యాటక స్థలాలా..?
మరఠ్వాడాలోని కరువు ప్రాంతాలు రాజకీయ నాయకులకు పర్యాటక ప్రాంతాలుగా మారినట్లుగా కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడి కరువు ప్రాంతాలను ఎన్సీపీ అధినేత శరత్ పవార్ పర్యటించారు. అప్పటి నుంచి ఇక్కడి కరువు ప్రాంతాలను మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు క్యూ కట్టారు. వీరి పర్యటనల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో కూడా ఎటువంటి మేలు జరగకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని మాజల్‌గావ్ పరిధిలోని కొందరు రైతుల నిర్ణయించుకున్నారు. సీఎం రాకతో తమకు ఏదైనా మేలు జరుగుతుందనే గంపెడు ఆశలో ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్నారు.