స్వైన్‌ఫ్లూ చికిత్స ఖర్చునుపభుత్వమే భరిస్తుంది: సీఎం | Maharashtra govt to bear swine flu treatment cost: Fadnavis | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ చికిత్స ఖర్చునుపభుత్వమే భరిస్తుంది: సీఎం

Published Mon, Mar 2 2015 5:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

స్వైన్‌ఫ్లూ చికిత్స ఖర్చునుపభుత్వమే భరిస్తుంది: సీఎం

స్వైన్‌ఫ్లూ చికిత్స ఖర్చునుపభుత్వమే భరిస్తుంది: సీఎం

- ఆదివారం ఒక్కరోజే 12 మంది మృతి
- ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామన్న సీఎం ఫడ్నవీస్

ముంబై: స్వైన్‌ఫ్లూకు ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వ్యాధి బారిన పడి ఆదివారం ఒక్కరోజే 12 మంది మృతి చెందారు. దీంతో ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య 143కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ రోజరోజుకీ తీవ్రమవుతుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని, ఫ్లూ లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశామని సీఎం తెలిపారు. చికిత్స నుంచి పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందన్నారు. నాగ్‌పూర్, పుణే ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత తగ్గుతోందని, లాథూర్ ప్రాంతంలో ఎక్కువవుతోందని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఫ్లూ విజృంభనపై ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న పదిహేను రోజులు తమకు చాలెంజ్‌తో కూడుకున్నవని, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి స్వతహాగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ప్రతిపక్షాల విమర్శలకు స్పందించిన సీఎం ప్రభుత్వంపై విమర్శలు మానుకుని సహాయ సహకారాలు అందించాలని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ‘స్వైన్‌ఫ్లూ మహారాష్ట్రకే పరిమితం కాలేదు. మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలు ఆ వైరస్ వల్ల బాధలు పడుతున్నారు. అన్ని చోట్ల ఇది తీవ్రంగా ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి నేను సాధ్యమైనంత మేర పనిచేస్తున్నాం. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షం సహాయం కావాలి. పొరపాట్లు ఎక్కడున్నాయో చెబితే వాటిని సరిదిద్దుకుంటాం’ అని ఆయన అన్నారు.

ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలి: పాటిల్
‘స్వైన్‌ఫ్లూ బారిన పడి ప్రజలు మృత్యువాత పడుతుంటే ఆరోగ్య శాఖ మంత్రి ముంబైలో కూర్చున్నాడు. అధికారులు కార్యాలయాల్లో ఈగలు జోపుకుంటున్నారు. ఫ్లూ మందుల ధరలు సామాన్యుడికి అందనంత స్థాయికి చేరిపోయాయి. ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పత్రికల్లో కానీ, టీవీల్లో కానీ ప్రభుత్వం ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. విపత్తు నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని ప్రతిపక్ష నేత పాటిల్ విమర్శించారు. ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవాలంటే  ఇంకా ఎన్ని చావులు చూడాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement