మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్.. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే
సాక్షి, ముంబై : సంచలనంగా మారిన ఆడియో టేపు వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ ఆయన కార్యకర్తలతో చెప్పిన మాటల టేపును శివసేన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అది ఎడిట్ చేసిన ఆడియో అని ఫడ్నవిస్ చెబుతున్నారు. శనివారం ఓ మీడియా ఛానెల్‌తో సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు.
‘ఆ టేపును నేనూ విన్నాను. అందులో గొంతు నాదే. కాదనను. కానీ, అది ఎడిట్ చేసింది. సామ దాన దండ భేదోపాయాలను ఉపయోగించండి అని చెప్పిన మాట వాస్తవం. కానీ, అది వేరే సందర్భంలో చెప్పాను. పలు సందర్భాల్లో నేను మాట్లాడిన మాటల్ని జత చేసి ఆడియో టేపును సృష్టించారు. పైగా 14 నిమిషాల నిడివి ఉన్న ఆ క్లిప్ అసంపూర్తిగా ఉంది. త్వరలో ఆ ఆడియో క్లిప్‌ను ఎన్నికల సంఘానికి సమర్పించబోతున్నా. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫర్వాలేదు’ అని రిపోర్టర్‌తో ఫడ్నవిస్ చెప్పారు.
కాగా, పాల్ఘడ్ లోక్‌సభ స్థానానికి త్వరలో(మే 28వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే శుక్రవారం ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ ఆడియో టేపును విడుదల చేశారు. ‘బీజేపీ అంటే ఏంటో ప్రత్యర్థులకు చూపాలని, అవసరమైతే ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగించాలని’ ఫడ్నవిస్ చెప్పారంటూ థాక్రే ఆ క్లిప్‌ను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment