దబోల్కర్ హత్యకు రెండేళ్లు
♦ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కేసు పరిస్థితి
♦ నిరసనగా ర్యాలీ చేపట్టిన దబోల్కర్ కుమార్తె
♦ దర్యాప్తు వేగవంతం చేసేందుకు మరో బృందాన్ని ఏర్పాటు చేసిన సీఎం
పింప్రి : అంధశ్రద్ధ నిర్మూలన సమితి సంస్థాపక కార్యాధ్యక్షులు డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య జరిగి రెండు ఏళ్లు పూర్తయ్యాయి. 2013 ఆగస్ట్ 20న ఆగంతకుల చేతిలో దాబోల్కర్ హత్యకు గురయ్యారు. ఇప్పటికీ హంతకులను పట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సతారా జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. దబోల్కర్ హత్యకు గురైన ప్రాంతంలో సరిగ్గా అదే సమయంలో ఉదయం 7.55 నిమిషాలకు దబోల్కర్ కూతురు ముక్తా దబోల్కర్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. హంతకులను వెంటనే పట్టుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అమాయక ప్రజలను మోసగిస్తున్న బ్లాక్ మాజిక్‌కు వ్యతిరేకంగా నరేంద్ర దబోల్కర్ ఉద్యమం లేవనెత్తారు.
బ్లాక్ మ్యాజిక్ ద్వారా మోసం చేస్తున్న వారి నుంచి ప్రజలను రక్షించేందుకు సమితి కార్యకర్తలను 17 బృందాలుగా చేసి దేశ వ్యాప్తంగా 335 గ్రామాల్లో అంధశ్రద్ధ నిర్మూలనకు కోసం జనజాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో పుణేలోని ఓంకారేశ్వర్ దేవాలయం వద్ద మహర్షి ఖండే బ్రిడ్జిపై మార్నింగ్ వాకింగ్ చేసి వస్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఆగంతకులు దబోల్కర్‌పై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన మరణానంతరం ఈ రెండేళ్ల కాలంలో దబోల్కర్ ఆలోచనలు రాష్ర్టవ్యాప్తంగా కార్యరూపం దాల్చాయి. రాష్ట్రంలో అంధశ్రద్ధ నిర్మూలన శాఖలు సుమారు 300లకు పైగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో బ్లాక్ మాజిక్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం రూపొందించడంతో దేశ వ్యాప్తంగా ఇదే చట్టాన్ని అమలు చేయాలని అనేక రాష్ట్రాలు ముందుకొచ్చాయి. కర్నాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టం అమలులోకి వచ్చింది.
దర్యాప్తునకు ఏడుగురు సభ్యులతో బృందం ఏర్పాటు
దబోల్కర్ హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సీబీఐకి తోడుగా ఏడుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం వెల్లడించారు. దబోల్కర్ హత్యకు గురై గురువారంతో రెండేళ్లు పూర్తికావస్తోంది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. దీంతో వీరికి సాయంగా ఏర్పాటు చేసిన బృందంలో ఒక అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్, నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు సహాయక అధికారులు ఉంటారు.
ఇందులో పుణేకి చెందిన అసిస్టెంట్ పోలీసు కమిషనర్ జీ.ఎస్.మడ్గుల్కర్, పోలీసు ఇన్‌స్పెక్టర్ దిన్కర్ కదం, అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సుభాష్ చవాన్, నాగపూర్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ సతీశ్ దేవరే, యవత్మాల్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ చంద్రకాంత్ ఘోడ్కే తదితరులు ఉన్నారు. తమకు తగినంత మానవ వనరులు లేవని, కొంతమంది అధికారులను తమకు సాయంగా అందజేయాలని సీబీఐ కోరడంతో ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.