సాక్షి, ముంబై : ప్రభుత్వ ఖజానా ఆదాయాన్ని పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ఆర్థిక శాఖ కోరింది. అత్యుత్తమ సలహాలు, సూచనలు ఇచ్చిన వారిక మొదటి బహుమతిగా రూ. 10 లక్షలు, రెండో బహుమతిగా రూ.6.50 లక్షలు నగదు పారితోషకం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఒక్కో మంచి సలహాకు రూ.లక్ష చొప్పున 25 మందికి పారితోషికాలు అందజేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన రూపొందించిన ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించింది. ఆయన నుంచి ఆమోదం లభించగానే దీనిపై అధికారకంగా ప్రకటించనున్నారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవించడం, మరికొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల వరదలు రావడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, రూ.3 లక్షల కోట్ల వరకు ఉన్న రైతుల రుణాలు, వాటి వడ్డీ మాఫీ వంటివి రూ. లక్షల కోట్లలో చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై భారీ స్థాయిలో అదనపు భారం పడుతోంది. వివిధ శాఖల నుంచి పన్ను రూపంలో సమకూరుతున్న ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. అలాగే పెరుగుతున్న పరిపాలన విభాగం ఖర్చుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింటోంది.
దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఉన్నతస్థాయి సమితిని నియమించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అయతే అంతకు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3,85,000 కోట్లకు ైపైగా అప్పు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే ఆదాయం తగ్గిపోతుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఫలితంగా చాలా వరకు అభివృద్ధి పనులకు కత్తెరేయాల్సిన దుస్థితి నెలకొంది.
సూచన ఇవ్వండి.. బహుమతి పట్టండి
Published Thu, Jul 30 2015 2:37 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement