రేపు 'మహా' కేబినెట్ విస్తరణ
ముంబయి: అవినీతి ఆరోపణలతో వైదొలగిన సీనియర్ మంత్రి, మిత్రపక్షంతో విబేధాలు, కీలక శాఖలన్నీ తన వద్దే ఉండటంతో ముఖ్యమంత్రిపై పెరిగిన ఒత్తిడి.. ఇన్ని అంశాల నేపథ్యంలో బీజేపీ పాలిత మహారాష్ట్ర లో రేపు(శుక్రవారం) కేబినెట్ విస్తరణ జరగనుంది. అధికారం చేపట్టి 20 నెలలు పూర్తయిన తర్వాత జరగబోతున్న తొలి విస్తరణ కావడంతో ఇటు బీజేపీతోపాటు మిత్రపక్షాలైన శివసేన, ఇతర పార్టీ ఎమ్మెల్యేల్లో ఆశలు గుబాళిస్తున్నాయి. ప్రస్తుతం మహా కేబినెట్ లో 14 ఖాళీలున్నాయి.
జులై 18 నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 10న సీఎం ఫడ్నవిస్ నాలుగు రోజుల రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారమే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నిర్వహిస్తోన్న 10 శాఖల్లో కొన్ని, భూ అక్రమాల ఆరోపణలతో రాజీనామా చేసిన రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే స్థానాన్ని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు మహా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొత్త మంత్రి వర్గంలో బీజేపీకి కీలక మిత్రపక్షమైన శివసేనకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. స్వాభిమాని పక్ష పార్టీ రాష్ట్రీయ సమాజ్ ప్రకాశ పార్టీలకు తలో పదవి లభించనున్నట్లు సమాచారం. మిగిలిన పదవులను దక్కించుకునే బీజేపీ ఎమ్మెల్యేల్లో అదృష్టవంతులెవరో రేపు తేలిపోనుంది.