సాక్షి, ముంబై : మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన బీజేపీ, శివసేనల మధ్య ‘రాహుల్ గాంధీ సమర్థత’ అంశం చిచ్చురేపింది. ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోయిందని, ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, దేశాన్ని నడిపించగల సత్తా రాహుల్ గాంధీకి ఉందంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు తాజా దుమారానికి కారణమయ్యాయి.
ముంబైలో శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఫడ్నవిస్.. శివసేన వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంలో కొనసాగుతూ శివసేన ప్రతిపక్ష పాత్ర పోషించడం కుదరదని, ఆ పార్టీ నాయకులు ఏదిపడితే అతి మాట్లాడటం తగదని చురకలంటించిన సీఎం.. మరో అడుగు ముందుకేసి ‘కూటమిలో ఉండాలో, బయటికి వెళ్లాల్లో తేల్చుకోండి..’ అని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు సవాలు విసిరారు. బీజేపీ-శివసేనలు దశాబ్ధాలుగా మిత్రులుగానే ఉన్నాయని, నాడు బాలా సాహెబ్(బాల్ ఠాక్రే) సంకీర్ణ ధర్మానికి కట్టుబడితే, నేడు ఉద్దవ్ దానికి తూట్లు పొడుస్తున్నారని ఫడ్నవిస్ విమర్శించారు.
మోదీ ఓ గ్రాండ్ మాస్టర్! : ప్రధాని మోదీ పనైపోయిందంటూ శివసేన ఎంపీ సంయజ్ రౌత్ చేసిన వ్యాఖ్యలకు సీఎం ఫడ్నవిస్ ఘాటుగా సమాధానమిచ్చారు. సంజయ్ పేరును ప్రస్తావించకుండానే.. కొందరు శివసేన నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, ఇలాంటి వాళ్లపై వారి అధ్యక్షుడు(ఉద్దవ్) దృష్టిసారిస్తే బాగుంటుందని హితవుపలికారు. ‘‘దేశంలోని ముఖ్యమంత్రులందరికీ మోదీ ఒక రోల్ మోడల్. ఆయన ఒక అద్భుతమైన కమ్యూనికేటర్, అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్, దేశాన్ని మార్చేసిన గ్రేట్ లీడర్’’ అని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment