ఐపీఎల్ మ్యాచ్ లకు నీళ్లివ్వం: సీఎం ఫడ్నవిస్
ముంబై: ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర కరువు.. గడిచిన వందేళ్లలో కనీవినీ ఎరుగనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ లకు నీటి సరఫరా విషయమై కొద్ది కాలంగా నెలకొన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తరఫును ముక్తాయింపునిచ్చారు. శుక్రవారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐపీఎల్ మ్యాచ్ లకు చుక్కనీరు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
'ఐపీఎల్ మ్యాచ్ లకు మా ప్రభుత్వం నీళ్లిచ్చేదిలేదు. ఇదే వాదనను హైకోర్టులోనూ బలంగా వినిపించాం. నీళ్లివ్వని కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లు మహారాష్ట్ర నుంచి తరలిపోతే మాకేమీ అభ్యంతరం లేదు' అని సీఎం ఫడ్నవిస్ పేర్కొన్నారు. తీవ్రదుర్భిక్షంలో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం నీటిని వృధా చేయరాదని, మ్యాచ్ లను తరలించేలా ఆదేశాలు జారీచేయాలని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. పిల్ ను విచారించిన కోర్టు.. శనివారం ముంబైలో జరగాల్సిన మొదటి మ్యాచ్ కు మాత్రం అనుమతి మంజూరుచేస్తూ మిగతా మ్యాచ్ ల వ్యవహారంపై వాదనలను ఈ నెల 12కు వాయిదావేసింది.ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై, పుణె, నాగ్పూర్ల్లో 19 మ్యాచ్‌లు జరగాల్సివుంది. ఐపీఎల్ మ్యాచ్లు ఈ నెల 9న ఆరంభమవుతాయి.