♦ అప్పటి వరకూ ఆందోళనే: కాంగ్రెస్
♦ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపాటు
ముంబై : రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేవరకు సభ లోపల, బయట ఆందోళన కొనసాగుతుందని శాసనమండలిలో కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. విదర్భ, మరాఠ్వాడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సభలో సీఎం ప్రసంగం ఉందని నిప్పులు చెరిగింది. అనంతరం సీఎం మాట్లాడుతూ, రైతులు రుణాల నుంచి విముక్తి కలిగించాలంటే కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇందుకోసం తీసుకున్న ప్రమాణాలు చదివి వినిపించారు.
గత 15 ఏళ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలు కో ఆపరేటివ్ బ్యాంకులను అవినీతి మయం చేశాయని, నిధుల్ని పందికొక్కుల్లా తినేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఎం వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. సభ్యులంతా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో చైర్మన్ రామ్‌రాజే నింబకర్ సభను బుధవారానికి వాయిదావేశారు. రైతు సమస్యలను సీఎం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు.
ప్రమాద బాధితులకు రూ. 10 లక్షల పరిహారం
ప్రభుత్వ బస్సు ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రావుతే మంగళవారం వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంఎస్‌ఆర్టీసీకి చెందిన ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబీకులకు రూ. 3 లక్షల పరిహారం ఇస్తున్నామని చెప్పారు. కాగా, గత నెల ధూలే-చాలిస్‌గావ్ రోడ్డుపై చాలిస్‌గావ్-సూరత్ బస్సు, కంటైనర్ ఢీ కొన్న ఘటనలో 22 మంది మృతి చెందగా, 35 మంది గాయపడ్డారని కాంగ్రెస్ నేత కునాల్ పాటిల్ పేర్కొన్నారు. ధూలే-చాలిస్‌గావ్ రహదారిపై డివైడర్లు ఏర్పాటు చేయలేదని మంత్రి చెప్పారు. స్థానికులు ఈ విషయమై పోరాడుతున్నారని అన్నారు. దీనిపై రావుతే స్పందిస్తూ.. దూలే-చాలిస్‌గావ్ రోడ్డు ఎన్‌హెచ్-11లో భాగమని, రోడ్డు విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
‘మైనార్టీ’ ఉపకార వేతనాల ఆదాయ పరిమితి పెంపు
మైనార్టీ విద్యార్థుల ఉపకారవేతనానికి సంబంధించి ఆదాయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న రూ. రెండున్నర లక్షల పరిమితిని రూ. 5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మైనార్టీ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం 40,000 మంది విద్యార్థులు ఏడాదికి రూ. 25,000 ఉపకారవేతనాలు పొందుతున్నారని, ప్రభుత్వ ప్రస్తుత నిర్ణయంతో ఎక్కుమ మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని మంత్రి చెప్పారు.
రుణమాఫీ చేయాల్సిందే
Published Wed, Jul 22 2015 2:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement