వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా జీఎస్టీ అమలులోకి రాకపోతే రాష్ట్రం రూ.20 వేల కోట్లకుపైగా నష్టపోవాల్సి వస్తుందని సీఎం
జీఎస్టీ బిల్లు పాసవకపోతే నష్టమొస్తుందన్న సీఎం
కాంగ్రెస్ కారణంగానే బిల్లు పాస్ కాలేదు
ఆ పార్టీ తీరుకు నిరసనగా ఈ నెల 16న ఆందోళనలు
ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా జీఎస్టీ అమలులోకి రాకపోతే రాష్ట్రం రూ.20 వేల కోట్లకుపైగా నష్టపోవాల్సి వస్తుందని సీఎం దేవేంద్ర పడ్నవీస్ వెల్లడించారు. పార్లమెంటులో జీఎస్టీ బిల్లుపై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుండటంపై మండిపడ్డారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ జాతి ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల ఘోరపరాజయం నుంచి ఇంకా ఆ పార్టీ కోలుకోలేదని, గాంధీ కుటుంబ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.
జీఎస్టీ బిల్లును అడ్డుకోవడం ద్వారా దేశ ప్రజల దృష్టిని కాంగ్రెస్ ఆకర్షించగలదా అని ప్రశ్నించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని తీసుకొచ్చిందని, ఆర్థిక పురోగతికి బీజం వేసిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కకూడదనే కాంగ్రెస్ ఇలా ప్రతి విషయంలోనూ అడ్డుతగులుతోందని అన్నారు. 2016 ఏప్రిల్ 1 నాటికి జీఎస్టీ బిల్లు అమలు కాకుండా పార్లమెంటు సమావేశాలు సాగనీయడం లేదని ఆరోపించారు. దేశం మెత్తం మీద రూ. 2 లక్షల కోట్లు, రాష్ట్రంలో రూ. 20 వేల కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఒక్క కారణం కూడా లేకుండానే కాంగ్రెస్ సమావేశాలను అడ్డుకుందని మండిపడ్డారు.