వాషింగ్టన్: ఆత్మరక్షణ కోసం తుపాకులు వాడటం అమెరికన్లకు రాజ్యాంగమిచ్చిన హక్కు అంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, తుపాకుల నియంత్రణకు రూపొందిన చరిత్రాత్మక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఎగువ సభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. తుపాకుల కొనుగోలుపై ఆంక్షలు విధించే అత్యంత కీలకమైన ఈ బిల్లును ఆమోదించింది. 50 మంది డెమొక్రాట్లతో పాటు తుపాకుల నియంత్రణను తీవ్రంగా వ్యతిరేకించే రిపబ్లికన్ పార్టీకి చెందిన 15 మంది సెనేటర్లు కూడా అనుకూలంగా ఓటేయడం విశేషం.
దాంతో 100 మంది సభ్యుల సెనేట్‌లో 65–33 తేడాతో బిల్లు గట్టెక్కింది. దీన్ని త్వరలో డెమొక్రాట్ల ఆధిక్యమున్న దిగువ సభ (ప్రతినిధుల సభ)లో బిల్లు ప్రవేశపెడతారు. అయితే ఆమోదం లాంఛనమే. అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. దీనిపై బైడెన్ హర్షం వెలిబుచ్చారు. ‘‘28 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో చలనం వచ్చింది. తుపాకుల హింసకు అడ్డుకట్ట పడాలని కుటుంబాలకు కుటుంబాలు రోడ్డెక్కడంతో కాంగ్రెస్ సభ్యులంతా ఏకమయ్యారు’’ అని వ్యాఖ్యానించారు.
బిల్లులో ఏముంది?
21 ఏళ్ల కంటే తక్కువున్న వారు తుపాకులు కొనుగోలు చేస్తే వారి నేపథ్యంపై విస్తృతంగా వివరాలు సేకరిస్తారు. పాఠశాలల్లో భద్రతను పెంపొందించడానికి, ప్రజల్లో మానసిక సమస్యల నివారణకు ఆరోగ్య కార్యక్రమాలకు 1500 కోట్ల డాలర్ల నిధుల్ని కేటాయిస్తారు. ఎవరి చేతులోనైనా తుపాకులు ప్రమాదకరమని భావిస్తే లైసెన్స్ రద్దు చేసి తుపాకులు వెనక్కు తీసుకునే అధికారాలు రాష్ట్రాలకు సంక్రమిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ ఫ్లాగ్ చట్టాలు అమలు చేయడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment