తల్లిని షూట్ చేసిన నాలుగేళ్ల బాలుడు!
న్యూయార్క్: అమెరికాలో విచ్చలవిడి గన్కల్చర్ ఎలాంటి అనర్థాలకు కారణమౌతుందో చెప్పె ఘటన ఇది. కారులో వెనుక సీట్లో కూర్చున్న ఓ నాలుగేళ్ల బాలుడు.. డ్రైవింగ్ చేస్తున్న తల్లిని వెనుక నుండి షూట్ చేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జాక్స్విల్లే ప్రాంతానికి చెందిన జేమీ గిల్ట్ వృత్తి రిత్యా న్యాయవాది. మంగళవారం ఆమె తన నాలుగేళ్ల కొడుకుతో పుట్నం కౌంటీ ప్రాంతంలో కారులో వెళ్తుంది. ఆ సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్న బాలుడు అక్కడే ఉన్న హ్యండ్ గన్ను చేతిలో పట్టుకొని ఆడుతూ అనుకోకుండానే ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో బుల్లెట్ జేమీ వీపు భాగం నుంచి దూసుకెళ్లింది. జేమీని ప్రాణాపాయ స్థితిలో గమనించిన అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఘటన జరగడానికి కొద్ది గంటల ముందే.. టార్గెట్ను షూట్ చేస్తున్నాడంటూ తన కుమారుడి షూటింగ్ ప్రతిభను మెచ్చుకొంటూ జేమీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేయడం విశేషం. జేమీ ఉదంతంతో గన్కల్చర్పై సోషల్ మీడియాలో మరోసారి భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.