Dogs Attack: నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి | Hyderabad Dog Attack 4year old Boy | Sakshi
Sakshi News home page

Dogs Attack: నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి

Published Mon, Apr 29 2024 7:08 AM | Last Updated on Mon, Apr 29 2024 7:10 AM

Hyderabad Dog Attack 4year old Boy

 నాలుగేళ్ల బాలుడిపై మూకుమ్మడి దాడి

కాలు పట్టి బయటికి ఈడ్చుకెళ్లిన శునకాలు

కట్టెతో కొట్టి తల్లి వెళ్లగొట్టడంతో దక్కిన ప్రాణాలు
   
చిన్నారి ముఖానికి 10 కుట్లు వేసిన వైద్యులు  

కుక్కల బెడదను అరికట్టడంలో యంత్రాంగం విఫలం 

మలక్‌పేట: నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం మలక్‌పేటలోని మూసారంబాగ్‌ డివిజన్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో నాలుగేళ్ల బాలుడు ఉజ్వల్‌ కుమార్‌పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తాను ఇంట్లోంచి బయటి రాకపోతే కుమారుడి ప్రాణాలు దక్కేవి కావని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేయడం ఈ ఘటన తీవ్రతకు అద్దంపడుతోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లి పేట గ్రామానికి చెందిన జంపన సాయికుమార్, అలేఖ్య దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి మూసారంబాగ్‌లో నివాసం ఉంటున్నారు.

వీరికి ఉజ్వల్‌కుమార్‌ (4), ఆరు నెలల వయసున్న మరో బాబు ఉన్నారు.  శనివారం సాయంత్రం చిన్న కుమారుడికి అలేఖ్య పాలు తాపుతుండగా.. ఉజ్వల్‌కుమార్‌ నిద్ర లేచి అపార్ట్‌మెంట్‌ గేట్‌ వైపు వెళ్తుండగా వీధి కుక్కలు వచ్చి అతనిపై దాడిచేశాయి. మొదట కుడికాలు పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ వెళ్లి బాలుడి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు గట్టిగా ఏడ్వడంతో గదిలోంచి తల్లి బయటికి వచి్చంది. అప్పటికే కుక్కలు బాలుడిని కరుస్తున్నాయి.

ఆమె కేకలు వేస్తూ వాటిని కట్టెతో కొట్టి వెళ్లగొట్టింది. బాలుడి ముఖంపై, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో ఒళ్లంతా రక్తంతో తడిసి పోయింది. చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉజ్వల్‌కుమార్‌ ముఖానికి వైద్యులు చికిత్స చేశారని, 10 కుట్లు వేశారని తండ్రి సాయికుమార్‌ తెలిపారు. గది నుంచి బయటికి రావడం ఆలస్యమైతే తమ కొడుకును కుక్కలు చంపేసి ఉండేవని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడదను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement