తుపాకి సంస్కృతి మరోసారి అమెరికాలో నెత్తురు పారించింది. ఫ్లోరిడా రాష్ట్రం లోని పార్క్‌లాండ్ నగరంలో ఉన్న పాఠశాలలో ఒక ఉన్మాద యువకుడు సెమీ ఆటోమాటిక్ రైఫిల్ చేతబూని మూడంటే మూడే నిమిషాల్లో 17మంది పసివాళ్ల ఉసురుతీశాడు. మరో 15మందిని గాయపరిచాడు. వీరిలో ముగ్గురు మినహా మిగిలినవారికి ప్రాణాపాయం తప్పి ఉండొచ్చుగానీ ఈ ఉదంతం సృష్టించిన భయో త్పాతం వీరిని జీవితాంతమూ వెంటాడుతూనే ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారం భమై 45 రోజులవుతుండగా అక్కడి పాఠశాలల్లో తుపాకి పేలడం ఇది 18వసారి. 3,200 మంది చదువుకునే ఒక పాఠశాలలో అప్పటికే దాన్నుంచి బహిష్కృతుడైన ఒక ఉన్మాద విద్యార్థి ప్రవేశించి, పిల్లల్ని కాల్చుకుంటూ పోవడం ఊహించడానికే భయంకరమైన సన్నివేశం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా తీవ్ర సంతాపం ప్రకటించడం, ఊరడింపు మాటలు మాట్లాడటం అమెరికాలో మామూలే. అధ్య క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా ఆ లాంఛనాన్ని పూర్తిచేశారు. దాంతోపాటు ఎప్పటిలాగే దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా చేశారు. నిందితుడి మానసిక ఆరోగ్యం బాగా లేదన్నారు. నిరుడు టెక్సాస్ చర్చిలో ఒక ఉన్మాది 26మందిని కాల్చి చంపేసినప్పుడు కూడా ఆయన అచ్చం ఇలానే మాట్లాడారు. అప్పడు మాత్రమే కాదు... తుపాకి పేలినప్పుడల్లా ఆయనకు అందులో మానసిక అనారోగ్యమే సమస్యగా కనిపిస్తుంది. చదువుల బడులు జేమ్స్‌బాండ్ సినిమాల తరహాలో తుపాకి కాల్పులకు వేదికలు కావడం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్క అమెరికాలోనే కని పిస్తుంది. ఇది దాని ప్రారబ్ధం కాదు... చేజేతులా చేసుకున్నది.
అమెరికా పౌరులకు తుపాకి కలిగి ఉండే హక్కు ఎన్నడో 1791లో అక్కడి రాజ్యాంగానికి చేసిన రెండో సవరణ ద్వారా అమల్లోకొచ్చింది. దీన్ని వదుల్చు కోవడానికి సరిగ్గా యాభైయ్యేళ్లక్రితం ఆ దేశానికి అవకాశం వచ్చింది. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని దుండగులు కాల్చిచంపాక సాధా రణ పౌరులకు సులభంగా తుపాకులు అందుబాటులోకి రానీయొద్దన్న డిమాండు వచ్చింది. అయితే అది త్వరలోనే చల్లారిపోయింది. కానీ 1968లో పౌర హక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, సెనెటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ సైతం ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయాక ఆ చర్చ మళ్లీ తలెత్తింది. అది సవ్యంగా కొనసాగి, ఒక అర్ధవంతమైన పరిష్కారం లభించి ఉంటే అమెరికా ఇప్పుడీ పరి స్థితుల్లో ఉండేది కాదు. కానీ ఆ సంవత్సరం తుపాకుల నియంత్రణ చట్టం అమల్లోకొచ్చింది. దాని ప్రకారం తుపాకుల అమ్మకందార్లు పోస్టు ద్వారా జరిగే అమ్మకాల్ని నిలిపేయాలి. అలాగే తుపాకి కొనేవారికి నేర చరిత్ర ఉందో, లేదో చూడాలి. మానసిక రోగులకు అమ్మకూడదు. ఇలాంటివే ఇంకా చాలా నిబంధనలు న్నాయి. కానీ అంగట్లో సరుకులమ్మినట్టు తుపాకులు అమ్మకూడదన్న నిషేధం మాత్రం లేదు. ఫలితంగా ఎవరైనా తుపాకి కొనుక్కోవచ్చు. వారికి దాంతో ఏం పని, ఎందుకు కొన్నారని ఆరా తీసే నాథుడు లేడు. ఆస్ట్రేలియాలో 1996లో ఉన్మాది ఒకడు 35మంది పర్యాటకుల్ని కాల్చిచంపినప్పుడు అక్కడి ప్రభుత్వం చురుగ్గా కదిలి పౌరుల వద్ద ఉన్న తుపాకుల్ని వెనక్కు ఇచ్చేయమని కోరింది. అందుకైన డబ్బు వెనక్కి ఇచ్చింది. అవి తప్పనిసరనుకుంటున్నవారు పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే వారు తనిఖీ చేసి పర్మిట్ మంజూరు చేసే విధానం అమల్లోకి తెచ్చారు. బ్రిటన్‌లోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ఇలాంటి విధానమే అమల్లో ఉంది.
తుపాకులు విచ్చలవిడిగా లభించేచోట వాటివల్ల ముప్పు ఎక్కువ ఉంటుం దని, పకడ్బందీ నియంత్రణలున్నచోట తీవ్రత తక్కువుంటుందని ఇంగితజ్ఞానం ఉన్నవారికి అర్ధమవుతుంది. కానీ రిపబ్లికన్ పార్టీకి ఆ జ్ఞానం లేదు. బరాక్ ఒబామా పదవిలో ఉన్నప్పుడు ఈ తుపాకుల సంస్కృతిని ధ్వంసం చేయాలని గట్టిగా ప్రయ త్నిస్తే రిపబ్లికన్లు దాన్ని సాగనివ్వలేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏ)కు వత్తాసుగా, దానికి లబ్ధి చేకూరేలా మొదటినుంచీ అది వ్యవహరిస్తోంది. ప్రపం చంలో పౌరుల దగ్గరున్న తుపాకుల్లో సగం అమెరికా వాసుల్లోనే ఉన్నాయని గణాం కాలు చెబుతున్నాయి. అలాగని అమెరికాలో అందరికీ ఈ పిచ్చి లేదు. జనాభాలో 3 శాతంమంది వద్ద మాత్రమే తుపాకులున్నాయి. అయితే వీరిలో ఒక్కొక్కరి వద్ద సగ టున 40 తుపాకులుంటాయని అంచనా. మొత్తంగా పౌరుల దగ్గరున్న తుపాకుల సంఖ్య 13 కోట్ల 30 లక్షలు. ఇవి నిరుడు వెలువడిన గణాంకాలు. విషాదమేమంటే 1968 నుంచి ఇంతవరకూ తుపాకుల కారణంగా అమెరికాలో మరణించినవారి సంఖ్య ఆ దేశ చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాలన్నిటిలో చనిపోయినవారి అమె రికన్ల సంఖ్య కన్నా చాలా ఎక్కువ. ఏటా అమెరికాలో తుపాకి హింసతో 33,000 మంది చనిపోతున్నారు. ఇందులో మూడింట రెండొంతులు ఆత్మహత్యలు, మిగిలి నవి హత్యలు. గాయపడేవారి సంఖ్య 70వేల పైమాటే. తుపాకులు లేకుండా చేయా లన్న డిమాండు అరణ్యరోదన అవుతుండగా, ఆ బూచి చూపించి ఇతరేతర వ్యాపా రాలు విస్తరిస్తున్నాయి. పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్‌లు అమ్మడం మొదలు కొని పాఠశాలల పకడ్బందీ రక్షణ బాధ్యత తీసుకుంటామంటూ సొమ్ము చేసుకునే సంస్థల వరకూ అనేకం వెలుస్తున్నాయి. వాటి వ్యాపారం విలువ నిరుడు దాదాపు 300 కోట్ల డాలర్లు!
ఇలాంటి విపత్కర పరిస్థితికి దేశం చేరుకుంటే డోనాల్డ్ ట్రంప్ ఎప్పటి మాదిరే ‘మానసిక అనారోగ్యం’ వాదన తీసుకురావడమంటే అమెరికా ప్రజల్ని వంచిం చడమే. మళ్లీ ఒకటి, రెండు వారాల్లో ఇవే ఘటనలు పునరావృతం కావడానికి దోహదపడటమే. ఎటునుంచో ఉగ్రవాదులు చొరబడి దురంతాలకు పాల్పడతారని అనుక్షణం వణికే అమెరికా సమాజం తనలో అంతర్లీనంగా తిష్ట వేసుకుకూర్చున్న శత్రువు జాడను పసిగట్టలేకపోతోంది. దానికి వ్యతిరేకంగా బలమైన స్వరం విని పించలేకపోతోంది. కత్తి అంచున సాగే తన ప్రయాణంలో ప్రతి అడుగూ ప్రాణాంత కమైనదేనని గుర్తించనంతవరకూ... దాన్ని సరిదిద్దుకోనంతవరకూ అమెరికాకు ఇలాంటి విషాద ఉదంతాలు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment