హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్ అయి తీవ్ర గాయాలతో మృతి చెందిన సంఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా గరిడెపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన 12వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ (పీసీ–1769) శ్రీకాంత్ (29) హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఖబూతర్‌ఖానా ఔట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు.
2018 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ రెండున్నర సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి నైట్ డ్యూటీలో ఉండి..ఔట్ పోస్టులో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న గన్ మిస్‌ఫైర్ కావడంతో గొంతుకు గాయమైంది. దీంతో శ్రీకాంత్‌ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఉన్నతాధికారులు ఉస్మానియాకు చేరుకొని వివరాలను సేకరించారు.
మూడు నెలల క్రితం కోదాడ ప్రాంతానికి చెందిన యువతితో శ్రీకాంత్‌కు వివాహం నిశ్చయమైందని, వచ్చే ఏడాది వేసవిలో వివాహం జరగాల్సి ఉందని, అంతలోనే ఇలా జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment