
వాషింగ్టన్: అమెరికాలోని నైరుతి రాష్ట్రమైన అరిజోనాలో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. నిందితుడు మోటారు వాహనంపై వీధిలో తిరుగుతూ.. యధేచ్చగా కాల్పులు జరిపాడు. ఫీనిక్స్ పరిసర ప్రాంతాల్లోని ఎనిమిది చోట్ల ఒకటిన్నర గంటలపాటు బీభత్సం సృష్టించాడు. వెస్ట్ వ్యాలీలో కేవలం 90 నిమిషాల వ్యవధిలో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించగా.. మరో తొమ్మిది మందికి గాజు ముక్కలు గుచ్చుకుని గాయపడ్డారు. వీటివల్ల ప్రాణాపాయం లేదని తెలిసింది. కాగా ఈ ఘటనపై పియోరియా పోలీసు ప్రతినిధి బ్రాండన్ షెఫెర్ట్ మాట్లాడుతూ.. నిందితుడు ఇలా ఎందుకు చేశాడో తెలియదని, ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటన చాలా మందిని భయబ్రాంతులకు గురి చేసిందని తెలిపారు.
గత ఏడాది 43,000 మంది మృతి
ఇక గత నెలలో కాలిఫోర్నియాలోని సమీప రాష్ట్రంలో రైల్వేలో పనిచేసే ఓ ఉద్యోగి తొమ్మిది మందిని కాల్చి చంపాడు. అంతే కాకుండా మార్చి నెలలో కొలరాడోలో ఓ కిరాణా దుకాణంలో జరిగిన మరో ఘటనలో పది మంది మరణించారు. గత ఏడాది అమెరికాలో ఆత్మహత్యలు, కాల్పుల్లో మరణించిన వారు 43,000 మంది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి.
చదవండి: ఇకపై వాహనాలకు ఏకీకృత కాలుష్య సర్టిఫికెట్