
గన్ కల్చర్..!
♦ జిల్లా వాసులను కలవరపెడుతున్న తుపాకీ సంస్కృతి
♦ పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న కిరాయి హంతకులు
♦ పక్కా ప్రొఫెషనల్స్‌ను దించుతున్న నేరస్తులు
♦ ఒకే ఒక్క బుల్లెట్‌తో ప్రాణాలు తీసే సమర్ధులు
♦ పోలీసులకు సవాలుగా మారుతున్న తాజా పరిణామాలు
విజయనగరం.. ప్రశాంతతకు మారుపేరు. వివిధ సంస్కృతులకు ఆలవాలం. విద్యల నగరంగా ప్రసిద్ధి. అలాంటి జిల్లాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కక్షలు తీర్చుకునేందుకు నేరాలు చేయడంలో ఆరితేరిన వారిని, ఒకే బుల్లెట్‌తో ప్రాణాలు తీసేవారిని వినియోగిస్తుండడం పోలీసులకు సవాల్‌గా మారింది.
‘జూలై 22 శనివారం రాత్రి 9 గంటల సమయం.. పార్వతీపురంలో దుకాణం మూసేసి ఇంటికి తిరిగి వచ్చిన మురళీకృష్ణ ఇంటిలోపలికి వెళ్లేలోపే తుపాకీ కాల్పులకు బలైపోయాడు, ఒకే ఒక్క బుల్లెట్‌తో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.’
‘ఏప్రిల్ 16న సరిగ్గా సాయంత్రం 6.30 గంటలకు నడక కోసం వెళ్లి తిరిగి వస్తున్న వ్యక్తిపై బొబ్బిలి కోటి చెరువు వద్ద కాల్పులు జరిగాయి. బాధితుడు గాయాలతో తప్పించుకున్నాడు’.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలోనే ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో తుపాకీ కాల్పులు కలవరపెడుతున్నాయి. కంట్రీ మేడ్ పిస్టల్స్‌తో ప్రాణాలు తీసే సంస్కృతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కేవలం ఒకే ఒక బుల్లెట్‌తో మనిషి ప్రాణాలను తీసే ప్రొఫెషనల్ కిల్లర్స్‌ను దించి హత్యలు చేయిస్తున్నారంటే జిల్లాలో నేరాల ప్రయాణం ఏ దిశగా వెళుతుందో అర్ధం చేసుకోవచ్చు. అనునిత్యం తమ రూపాన్ని, స్వరూపాన్ని మార్చుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్న నేరస్తులు, వారు అనుసరిస్తున్న విధానాలు పోలీసులకు పెనుసవాళ్లు విసురుతున్నారు.
ఒకే ఒక్క బుల్లెట్..
పార్వతీపురం వ్యాపారి మురళీకృష్ణ హత్య కేసుతో పోలీసులకు ఓ విషయం స్పష్టంగా అర్ధమైంది. కంట్రీ మేడ్ పిస్టల్‌ను ఉపయోగించి పక్కా ప్రొఫెషనల్స్ ఈ హత్యకు పాల్పడ్డారు. అది కూడా డబ్బుల కోసం హత్యలు చేసే కిరాయి హంతకులు. అలాగని ఇదేదో పెద్ద ముఠా, దీనికెవరో డాన్ ఉన్నాడనుకుంటే పొరపాటు. ఈ ఆపరేషన్‌లో నేరుగా పాల్గొన్నది కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే.
వారు మాత్రం పిస్టల్ వాడటంలో సిద్ధహస్తులు. బుల్లెట్ వృథా కాకుండా 7.65 ఎంఎం పిస్టల్‌లోని ఒకే ఒక బుల్లెట్‌తో అతి సమీపం నుంచి (పాయింట్ బ్లాంక్) కాల్పులు జరిపారు. బైక్ స్టాండ్ వేస్తున్న వ్యాపారి ఎవరో మాట్లాడటానికి తనవైపు వస్తున్నారనుకున్నాడు. వచ్చిన వారు వ్యాపారికి తప్పించుకనే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయన చూస్తుండగానే కాల్పులు జరిపారు. అది కూడా ఒక్క బుల్లెట్‌కే ప్రాణం పోయే తలభాగంలో కాల్చారు. పని కాగానే అక్కడి నుంచి పరారయ్యారు. కిరాయి తీసుకుని మనుషుల్ని చంపే వాళ్లు మాత్రమే ఇంత పక్కాగా ప్లాన్ చేసి కాల్చగలరు.
సింగిల్ మేన్ గ్యాంగ్..
ఒడిశాలో మావోయిస్టుల నుంచి రక్షణ కోసమంటూ 7.65 ఎంఎంæ పిస్టల్స్‌ను కొంతమంది తమ దగ్గరపెట్టుకుంటుంటారు. అలాంటి వారెవరున్నారనేది తెలుసుకున్న మరికొందరు వారిని కలుసుకుని సుపారీ ఇచ్చి హత్యలు చేయిస్తున్నట్టు సమాచారం. ఈ కిల్లర్స్‌కి సాధారణంగా బాస్‌లంటూ ఎవరూ ఉండరు. తమ వద్ద ఉన్న పిస్టల్‌తో హత్యలు, ఇతర నేరాలు చేయడాన్ని స్వయం ఉపాధిలా భావిస్తుంటారు. కిరాయి తీసుకుని టార్గెట్‌ను కొంతకాలం గమనించి అప్పుడు ప్లాన్ గీసి యాక్షన్‌లోకి దిగుతున్నారు. వీరికి స్థానికంగా కొందరు గైడ్‌లా ఉపయోగపడుతుంటారు.
ఆపరేషన్ పూర్తికాగానే కాంటాక్ట్ నంబర్లన్నీ మార్చేసి తమ స్వస్థలానికి వెళ్లిపోయి రోజువారీ పనులు చేసుకుంటారన్నది సమాచారం. ఈ మొత్తం ఆపరేషన్‌లో తమ ప్రాణాలను సైతం వారు పణంగా పెడుతున్నారు. తుపాకులతో పోలీసులకు చిక్కితే, ఆ సమయంలో ఎదురుకాల్పులు జరిగితే వారి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అయినా ఇలాంటి పనులను ఒప్పుకుంటున్నారు. దీనికి కిరాయి కూడా భారీగా ఏమీ తీసుకోరు. తమకు సుపారీ ఇచ్చిన వ్యక్తికి తాము చేయబోయే హత్య వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని బట్టి దానిలో పర్సంటేజీ ప్రకారం కిరాయి నిర్ణయిస్తుంటారన్నది వినికిడి. దీని వల్ల ఒక్కో హత్యకు ఒక్కో రేటు ఉంటుంది. ఇలాంటి నేరస్తులు జిల్లాలో ప్రవేశించడం ఇప్పుడు సంచలనమవుతోంది.
ఇతర రాష్ట్రాల నుంచే..
పార్వతీపురం వ్యాపారి హత్యలో ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు మా విచారణలో తేలింది. వారు కిరాయి హంతకులు. పిస్టల్ వాడడంలో నిష్ణాతులు. వారికి ఇక్కడ కొందరు సహకరించారు. అయితే, పాత కక్షల వల్ల హత్య జరిగిందా లేక ఆర్థిక లావాదేవీలేమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. దీని కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వాటిలో ఒక టీం నోట్ల రద్దు దగ్గర్నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఆర్థి«క లావాదేవీలను పరిశీలిస్తుంది. మరో టీం సాంకేతిక సాక్ష్యాలను సేకరిస్తుంది.
మూడో టీం కిరాయి హంతకుల గురించి ఆరా తీస్తుంది. నాలుగో బృందం స్థానికంగా హంతకులకు సహకరించిన వారి గురించి కూపీ లాగుతుంది. స్థానిక వివాదాల గురించి ఐదో బృందం అధ్యయనం చేస్తుంది. జిల్లాలో సుమారు 14 మాత్రమే లైసెన్డస్ తుపాకులు ఉన్నాయి. వాటిని కూడా రెన్యువల్ చేయలేదు. అవన్నీ పోలీస్‌ల ఆధీనంలోనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచే హంతకులు వస్తున్నారు.
–జి.పాలరాజు, జిల్లా ఎస్పీ