మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ అశోక్‌కుమార్, పోలీసు స్టేషన్లో నిందితుడు శ్రీనివాసరావు
మద్యానికి బానిసయ్యాడు. తాగకపోతే బతకలేనన్నంతస్థాయికి చేరాడు. చివరకు మద్యానికి డబ్బులివ్వలేదనివృద్ధురాలైన తల్లిని ఇటుకతో కొట్టిచంపాడు. ఈ విషాదకర ఘటన మాతృదినోత్సవం మరుచటిరోజు సోమవారం నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, వృద్ధురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నెల్లిమర్ల: నెల్లిమర్ల మండల పరిషత్ ప్రాంగణం సమీపంలోవిజయనగరం మున్సిపాలిటీకి చెందిన మాస్టర్ పంప్‌హౌస్ ముందు ఓ గుడిసెలో జలుమూరు గౌరమ్మ(65).. కొడుకు శ్రీనివాసరావుతో కలిసి నివసిస్తోంది. కొంతకాలం కిందటి వరకు ఇద్దరూ కలిసి టిఫెన్ సెంటర్ నిర్వహించేవారు. వచ్చిన డబ్బులతో శ్రీనివాసరావు నిత్యం మద్యం సేవించడం అలవాటుగా చేసుకున్నాడు. టిఫెన్ అమ్మగా వచ్చిన మొత్తం డబ్బులు మద్యానికే ఖర్చుచేసేవాడు. ప్రశ్నిస్తే తల్లిపై తిరగబడేవాడు.
కొన్నిసార్లు చేతితో కొట్టేవాడు. అయితే, గత కొంతకాలంగా టిఫెన్ సెంటర్‌నిర్వహించకపోవడంతో మద్యానికి డబ్బులు కరువయ్యాయి. దీంతో నిత్యం డబ్బులు కోసం తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. సోమవారం కూడా మద్యానికి తల్లిని డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బుల్లేవని గౌరమ్మ చెప్పింది. దీంతో శ్రీనివాసరావు కోపం వచ్చి తల్లిని కొట్ట డానికి ప్రయత్నించాడు. గౌరమ్మ కొడుకు నుంచి తప్పించుకుని పరుగుపెట్టింది. వెంటపడిన శ్రీనివాసరావు ఇటుకలను తల్లి మీదకు విసిరాడు. ఇటుక తలవెనుక భాగంలో తగలడంతో గౌరమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయి తనువు చాలించింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు నెల్లిమర్ల ఎస్‌ఐ అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను, బంధువులను విచారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment