
పెరిగిపోతున్న గన్ కల్చర్
రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఒకప్పుడు కేవలం బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇది కనిపించేది. తర్వాత సినిమాల ప్రభావంతో అన్ని ప్రాంతాలకూ ఇది విస్తరించింది. తుపాకులు సులభంగా ఎక్కడ దొరుకుతాయంటే బీహార్ అని అందరూ చెబుతున్నారు. ఇది ఎంతెలా పాకిందంటే.. చివరకు ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా చేస్తున్న యువకుడు కూడా బీహార్ వరకు వెళ్లి రివాల్వర్ కొనుక్కొచ్చి.. ప్రియురాలి భర్తను చంపడానికి ప్రయత్నించారు!!
ఇంతకుముందు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రివాల్వర్లు పేలడం, తుపాకులు గర్జించడం లాంటి సంఘటనలు జరిగాయి. కొల్లేరు ప్రాంతంలో కొంతమంది వేటగాళ్లు పక్షులను వేటాడేందుకు ఉపయోగించే నాటు తుపాకులు కూడా చివరకు బీహార్ నుంచి వచ్చినవేనని చెబుతారు. ఈమధ్య విడుదలైన 'రాంలీలా' చిత్రంలో సైతం విచ్చలవిడిగా ఆయుధాల వాడకాన్ని చూపించారు. మనదేశంలో ప్రధానంగా రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే తుపాకులు విచ్చలవిడిగా అమ్ముతుంటారు. వాటిని ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలవాళ్లు కొంటున్నారు.
ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో తుపాకులు, రివాల్వర్లు, పిస్టళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా, వారి నిఘా కేవలం లైసెన్సు ఉన్న ఆయుధాలకే పరిమితం అవుతోంది. ఆయుధ లైసెన్సులు ఉన్నవాళ్లు తమ ఆయుధాలను స్టేషన్లలో డిపాజిట్ చేయాలని పోలీసులు ఆదేశించడం, వాళ్లు కొన్నాళ్ల పాటు సరెండర్ చేయడం మామూలే. అయితే.. ఒక్క లైసెన్సుడు రివాల్వర్ ఉంటే, దాంతోపాటు కనీసం అరడజను లైసెన్సు లేని రివాల్వర్లు ఉంటున్నాయన్నది ఒక అంచనా. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో అయితే ఇక తుపాకులు, బాంబు పేలుళ్ల గురించి చెప్పనక్కర్లేదు.
సినిమాల ప్రభావం, సులభంగా అందుబాటు, సంఘటన జరిగేవరకు ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టే సౌలభ్యం.. ఇలాంటి కారణాల వల్లే చిన్న సైజులో ఉండే రివాల్వర్ల పట్ల ఎక్కువ మంది మోజుపడుతున్నారు. రాష్ట్రంలో కూడా నేరాలు పెచ్చుమీరడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.