హూస్టన్: ఇంటికో తుపాకీ పథకం అమల్లో ఉందా అన్నట్లు కనిపించే అమెరికాలో గన్ కల్చర్.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను తోడేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగర సమీపంలోని హ్యారిస్ కౌంటీలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. కౌంటీ పోలీసు అధికారి ఎడ్ గోంజాల్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ‘బామెల్ నార్త్ హూస్టన్ రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఇంట్లో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు.
వీరిలో నాలుగు, మూడేళ్ల అక్కాచెల్లెళ్లు ఇంటి పడకగదిలోకెళ్లి అక్కడే ఉన్న సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను చూశారు. పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్న చెల్లెలు వెంటనే అక్కకు గురిపెట్టి కాల్చింది. తుపాకీ శబ్దంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అక్కడికొచ్చి చూసేసరికి నాలుగేళ్ల అమ్మాయి రక్తమోడుతూ కనిపించింది. 911కు ఫోన్‌చేసి అత్యవసర సిబ్బంది వచ్చి వైద్యంచేసేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. లోడ్ చేసిన తుపాకులను జాగ్రత్త చేయాలని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా తుపాకీ యజమానుల నిర్లక్ష్యం ఇలా ఎందరో అమా యకుల ప్రాణాలను బలికోరుతోంది’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment